మా గర్వం.. మా విజయం ఇస్రో !

పండు వెన్నెలతో పచ్చదనం పరుచుకున్న భూమి అందాన్ని మరింత పెంచే చందమామను చేరుకోవాలన్నది ఇస్రో కల. ఇందుకోసం చంద్రయాన్ 2 ని ప్రయోగించింది. 48 రోజుల ఓ అద్భుత ప్రయాణం అంతరిక్షంలో చంద్రయాన్ గమనం. ముందుగా భూ కక్ష్యలో పరిభ్రమణం. ఆ తర్వాత చంద్రుడి కక్ష్యలోకి మార్పు. వేగంలో మార్పులు. చివరికి విక్రమ్ ల్యాండర్ చంద్రమండలంపై అతికష్టమైన దక్షిణ ప్రాంతంలో ల్యాండింగ్. 6000 కి.మీ వేగంతో దూసుకొచ్చిన విక్రమ్ ల్యాండర్ జాబిల్లి ఉపరితలం చేరుకోవడానికి ఇంకా 2.1 కిలోమీటర్ల దూరం ఉందనగా సిగ్నల్స్ ఆగిపోయాయి. 95శాతం విజయం సాధించి.. 5శాతం దగ్గర ఆగిపోయింది.

ఈ బాధకర సమయాన యావత్ దేశం ఇస్త్రో శాస్త్రవేత్తలకి అండగా నిలబడటం గొప్ప విషయం. ప్రధాని నరేంద్రమోడీతో మొదలైన ఈ వెల్లువ ఆగలేదు. దేశాధినేతలు, రాజకీయ నాయకులు, సినీ తారలు, క్రీడాకారులు, అసంఖ్యాక జనం ఇస్రో వెన్నంటే నిలిచారు. క్లుప్తంగా చెప్పాలంటే భారత జాతి వారి వెనక నిలిచింది. ఇది చాలు ఇస్త్రో శాస్త్రవేత్తలు మరిన్ని గొప్ప విజయాలు సాధించేందుకు.

‘గర్వం ఎప్పుడూ ఓటమిని చూడదు. మా గర్వం.. మా విజయం ఇస్రో’ అంటూ బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ ట్విట్ చేశారు. ‘సక్సెస్ ఈజ్ నాట్ ఎ డెస్టినీ. ఇట్స్ ఎ జర్నీ చంద్రయాన్ -2తో ఇస్రో చరిత్రాత్మక ప్రయాణం మొదలు పెట్టింది. ఈ ప్రాజెక్టులో పనిచేసిన ప్రతి శాస్త్రవేత్తకు సెల్యూట్ చేస్తున్నా. మీరే మా నిజమైన హీరోలు. మీతో మేమున్నాం. మన విజయ గాథకు ఇదే ఆరంభం. ఇదే మార్గం’ అని టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ట్విట్ చేశారు. టీమిండియా తాజా, మాజీ క్రికెటర్లు, సినీ, రాజకీయ ప్రముఖులు, ప్రజలు ఇస్త్రోకి వెన్నంటి ఉన్నారు.