తెలంగాణలో బీజేపీ తొలివిజయం.. !
తెలుగు రాష్ట్రాల్లో, ప్రత్యేకంగా తెలంగాణలో భాజాపా ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం భాజాపా జాతీయాధ్యక్షుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రంగంలోకి దిగనున్నాడు. ఆయన తెలంగాణ నుంచి పార్టీ క్రియాశీల సభ్యత్వం తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో తెదేపా, కాంగ్రెస్ పేరున్న నేతలని పార్టీలో చేర్చుకొనేందుకు రాష్ట్ర బీజేపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. మరికొందరు స్వతహా బీజేపీ తలుపుతడుతున్నారు. తెరాసకి ప్రత్యామ్నాయం తామేనని నిరూపించుకోవడం తెలంగాణ బీజేపీ ముందున్న ప్రథమ లక్ష్యం. ఆ తర్వాత 2023లో అధికారమే ప్రధాన లక్ష్యంగా పావులు కదపనుంది.
ఆ దిశగా తెలంగాణ బీజేపీకి తొలి విజయం దక్కినట్టయింది. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం పిల్లర్లపై సీఎం కేసీఆర్ బొమ్మ, కారు, తెలంగాణ సంక్షేమ పథకాల గుర్తులు, పేర్లు చెక్కడం రాజకీయ వివాదానికి తీసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చెక్కిన బొమ్మలని చెరిపేసే పనిలో పడ్డారు. ఐతే వాటిని పూర్తిగా చెరిపేయాలని భాజాపా నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు భాజాపా ఎమ్మెల్యేలు రాజా సింగ్ తెలంగాణ ప్రభుత్వానికి వారం రోజుల గడువు ఇచ్చారు. శనివారం యాదాద్రి దర్శనానికి వచ్చిన రాజాసింగ్.. కలియతిరిగి నిర్మాణ పనులని పరిశీలించారు. శిలలపై చెక్కిన తెరాస పథకాలు, కేసీఆర్ బొమ్మలని చెరిపేయాలని డిమాండ్ చేశారు.
ఆ వెంటనే తెలంగాణ భాజాపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ కూడా యాదాద్రికి వచ్చారు. ఐతే, ఆయన్ని కొండపైకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకొన్నారు. మొత్తంగా తెలంగాణ బలపడాలని నిర్ణయించుకొన్న తర్వాత యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం పిల్లర్లపై చెక్కిన బొమ్మలని చెరిపేయాలంటే భాజాపా చేసిన ఆందోళన విజయవంతం అయినట్టయింది. దీంతో తెలంగాణలో భాజాపా తొలి విజయాన్ని సాధించినట్టు అనుకోవాలేమో.. ! మరీ.. భవిష్యత్ లోనూ ప్రధాన ప్రతిపక్షంగా మారి ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశిస్తుందా ? అన్నది చూడాలి.