నిర్బంధాలతో తమ పోరాటాన్ని ఆపలేరు : చంద్రబాబు

‘ఛలో ఆత్మకూరు’ ఏపీ రాజకీయాలని హీటెక్కించేశాయి. మూడ్రోజులుగా ‘ఛలో ఆత్మకూరు’పై అధికార, విపక్ష నేతలు మాటలు చేసుకొంటున్నారు. ఈరోజు అది చేతల దాక వచ్చింది. ‘ఛలో ఆత్మకూరు’ రెడీ అయిన తెదేపా అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుతో సహా మాజీ మంత్రులని పోలీసులు గృహ నిర్భంధం చేశారు. 

బుధవారం తెల్లవారుజామున నుంచే నేతలని గృహనిర్భంధంలో ఉంచారు. దీనిపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం 540 బాధిత కుటుంబాలను తమతమ గ్రామాలకు తరలించేవరకు తమ పోరాటం కొనసాగుతుందని చంద్రబాబు స్పష్టంచేశారు. మనిషికి జీవించే హక్కు, మాట్లాడే స్వేచ్ఛ, వారి ఆస్తులు, ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు.

ఆత్మకూరు వెళ్లేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చిన చంద్రబాబుని పోలీసులు అడ్డుకున్నారు. గేటుకు తాళం వేశారు. దీంతో చంద్రబాబు తన కారులోనే కూర్చొన్నారు. తనను చలో ఆత్మకూరు కార్యక్రమానికి వెళ్లేందుకు అనుమతించేదాకా అక్కడే వుంటానని ఆయన పోలీసులకు తేల్చి చెప్పారు. పోలీసుల తీరును నిరసిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెదేపా కార్యకర్తలు నినాదాలు చేశారు 

మరోవైపు, ప్రభుత్వ విధానాలపై పోరాటం చేస్తున్నందుకు చంద్రబాబుని అడ్డుకోలేదని.. పల్నాడులో ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉన్నందువల్లే ముందస్తుగా చంద్రబాబును నిర్బంధించినట్టు డీజీపీ గౌతం సవాంగ్ చెప్పారు.