దేశం గర్వపడే సమాధానమిచ్చిన శివన్

నేను తమిళుడినే. అంతకంటే ముందు భారతీయుడు. ఒక భారతీయుడిగా ఇస్త్రోలో చేరాను అన్నారు ఇస్రో ఛైర్మన్ శివన్. చంద్రయాన్-2 ప్రయోగం తర్వాత దేశమంతటా శివన్ పేరు మారుమ్రోగిపోతోంది. సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి.. అంతరిక్ష రంగంలో దేశ కీర్తిని నలుమూలలా వ్యాపింపజేస్తున్నారు. శివన్ నేతృత్వంలోనే ఒకేసారి 104 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపి ఇస్రో చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.

తాజాగా ఓ ప్రముఖ టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శివన్.. ప్రతి భారతీయుడు గర్వపడేలాంటి సమాధానం ఇచ్చారు. ఇంత గొప్ప స్థానంలో ఉన్న ఒక తమిళ వ్యక్తిగా తోటి తమిళులకు మీరు ఏం చెప్పదలచుకున్నారు అని అడగగా.. ‘నేను ఇస్రోలో ఒక భారతీయుడిగా చేరాను. అన్ని మతాలు, ప్రాంతాలు, భాషలకు చెందిన వ్యక్తులు ఇస్రోలో పని చేస్తున్నారు. ప్రాజెక్టుల్లో తమ వంతు సహకారాన్ని అందిస్తున్నారు. అయితే నన్ను తమ వాడిగా భావిస్తున్న నా సోదరులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నా’ అన్నారు 

శివన్. శివన్ చెప్పిన సమాధానానికి ట్విటర్ లో ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రాంతం, భాష, మతం ఏదైనా ఇస్రో కీర్తిని ఇనుమడింపజేస్తున్న శివన్ ని చూసి యావత్ దేశం గర్వపడుతోందని ఆయన్ని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.