మెగాస్టార్ తర్వాత నానినే ! 

మెగాస్టార్ చిరంజీవితో నేచురల్ స్టార్ స్టార్ ని పోల్చలేం. కానీ వీరిద్దరి నేపథ్యం మాత్రం ఒక్కటే. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా హీరోగా ఎదిగారు. స్టార్ హీరోలు అయ్యారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా యాక్టర్ అవుదామనుకునే ఆనాటి తరానికి చిరు, రవితేజ, నేటి తరానికి మాత్రం నాని స్పూర్తిగా నిలుస్తున్నారు అన్నారు యువ కథానాయకుడు కార్తీకేయ. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాని నటించిన చిత్రం గ్యాంగ్ లీడర్. ఇందులో కార్తీకేయ విలన్ పాత్రలో నటించారు. మంగళవారం వైజాగ్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది. 

ఈ సందర్భంగా కార్తీకేయ మాట్లాడుతూ.. “మీలాగే నేను కూడా నానికి పెద్ద ఫ్యాన్ ని. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా నటుడు అవుదామని ఇండస్ట్రీకి వచ్చే వారికి స్ఫూర్తిగా కొన్ని పేర్లు కనపడతాయి. మొదటి పేరు మెగాస్టార్ చిరంజీవిగారు. ఆ తర్వాత రవితేజగారు. కానీ, వాళ్లు వచ్చి చాలా కాలం అయింది. నాలాంటి యువతకు ఇంట్లో చెప్పడానికి ఒక పేరు కావాలి. మాకు కూడా నమ్మకం కలగడానికి ఒక పేరు కావాలి. చిరంజీవిగారి పేరు చెబితే, ఆయన ఎప్పుడో వచ్చారు. సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఎవరు ఉన్నారు? అని అంటే.. అప్పుడు మాకు కనిపించే పేరు నాని. ఆయన్ని ప్రతి విషయంలోనూ స్ఫూర్తిగా తీసుకోవచ్చు” అన్నారు.