‘సైరా’కు రాజమౌళి కట్స్
దర్శకధీరుడు రాజమౌళి ‘సాహో’ చిత్రాన్ని నిలబెట్టే ప్రయత్నం చేశారు. కానీ కుదరలేదు. ముందుగా సాహో రన్ టైం ని 3గంటలకిపైగా సెట్ చేశారు. దాన్ని 15నిమిషాల పాటు కుదించగలిగారు జక్కన్న. విడుదలకి ముందే సాహో చిత్రాన్ని రాజమౌళికి చూపించారు. ఆయన సలహాలు, సూచనలు తీసుకొన్నారు. రాజమౌళి చెప్పిన కొన్ని మార్పులు చేశారు. మరికొన్నింటిని వదిలేశారు. ఫైనల్ గా సాహో విడుదలైంది. మిక్సిడ్ టాక్ ని సొంతం చేసుకొంది. అభిమానుల అంచనాలని అందుకోలేకపోయింది.
ఇక సినిమా విడుదల తర్వాత రాజమౌళి సాహో సినిమా గురించి నోరు తెరవలేదు. ప్రమోట్ చేసే ప్రయత్నం చేయలేదు. ఈ విషయం పక్కనపెడితే.. ఇప్పుడు రాజమౌళి కోసం ‘సైరా’ స్పెషల్ షోని వేయనున్నారు. ముఖ్యంగా సినిమా రన్ టైం విషయంలో రాజమౌళి సలహాలు, సూచనలు తీసుకోనున్నారు. అయితే జక్కన్న చెప్పే సూచనలను చిరంజీవి పాటిస్తారా లేదా అనేది ఇక్కడ ప్రశ్న. ఎందుకంటే తన సినిమాలకు సంబంధించి అంతిమ నిర్ణయం ఎప్పుడూ చిరంజీవిదే. ఈ విషయంలో ఒక్కోసారి అల్లు అరవింద్ మాట కూడా ఆయన వినరు. అలాంటిది రాజమౌళి మాట వింటారా ? అన్నది చూడాలి.
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘సైరా’ తెరకెక్కింది. తొలితరం స్వాత్రంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా చిరు, ఆయన గురువు పాత్రలో బిగ్ బీ అమితాబ్ నటించారు. నయనతార, తమన్నా, అనుష్క, విజయ్ సేతుపతి, కిచ్చ సుధీప్, జగపతి బాబు తదితరులు కీలక పాత్రలో నటించారు. అక్టోబర్ 2న సైరా ప్రేక్షకుల ముందుకు రానుంది.