ఆత్మకూరు : వైసీపీ బాధితులకి చంద్రబాబు ఫోన్


ఆత్మకూరు అంశాన్ని అంతా ఈజీగా వదిలేలా లేడు తెదేపా అధినేత చంద్రబాబు. గత మూడ్నాలుగు రోజులుగా ఆత్మకూరు ఏపీసోడ్ ఏపీ రాజకీయాలని హీటెక్కించిన సంగతి తెలిసిందే. వైసీపీ బాధితులు అంటూ దాదాపు 200మందితో గుంటూరు నగరంలోని అరండల్ పేటలో ఓ శిబిరాన్ని ఏర్పాటు చేసింది తెదేపా. ‘ఛలో ఆత్మకూరు’ పేరిట వారికి ధైర్యం చెబితూ.. తిరిగి వారిని ఆత్మకూరులో విడిచిపెట్టి రావాలనే ప్లాన్ వేసింది తెదేపా. ఐతే, ఛలో ఆత్మకూరుని వైసీపీ తెలివిగా భగ్నం చేసింది. 

నేరుగా బాధితులతో మాట్లాడి.. వారికి రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చి సొంత గ్రామానికి, సొంతింటికి చేర్చింది. దీంతో కథ సుఖాంతం అయింది. అయినా.. ఈ వ్యవహారాన్ని చంద్రబాబు ఈజీగా వదిలేలా లేదు. ఈరోజు ఆత్మకూరు వైసీపీ బాధితులను చంద్రబాబు ఫోన్ చేసి మాట్లాడారు. మాజీ సర్పంచ్ ఏసోబుతో పాటు ఇతర బాధితులకు ఫోన్ చేసిన చంద్రబాబు ఇప్పుడైనా ఇళ్లకు వెళ్ళారా.. మళ్ళీ పొలాలకు వెళ్ళారా అని ప్రశ్నించారు. బాధితులు ఇళ్లకు వెళ్లి శుభ్రం చేసుకుంటున్నామని తెలపగా ఊళ్ళలో ఇప్పుడు పరిస్థితి ఏమిటని యోగ క్షేమాలను అడిగితెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని టీడీపీ అండగా ఉంటుందని చంద్రబాబు భరోసా ఇచ్చినట్టు సమాచారమ్.