బోటు ప్రమాదం : మరో 4మృతదేహాలు లభ్యం
విహారయాత్ర విషాదయాత్రగా ముగిసిన గోదావరి బోటు ప్రమాదంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఉదయం కచ్చులూరు
సమీపంలో మరో నాలుగు మృతదేహాలను వెలికితీశారు. దీంతో బోటు ప్రమాదంలో మృతుల సంఖ్య 12కు చేరింది. మొత్తం బోటులో 70మంది ఉన్నట్టు తెలుస్తోంది. వీరిలో 26మంది సురక్షితంగా బయటపడ్డారు. ఇప్పటివరకు 12మృత దేహాలు దొరికాయి. మరో 32మంది కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. ఇవాళ సాయంత్రం లోపు సహాయక చర్యలు పూర్తి చేస్తామని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు.
ఈ ఉదయం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బోటు ప్రమాద స్థలికి చేరుకొని పరిశీలించారు. బోటు ప్రమాద ప్రాంతంలో జగన్ ఏరియల్ సర్వే చేశారు. ఆస్పత్రిలో బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో అధికారులతో సమీక్షించనున్నారు. ఇక తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నారు. ఆస్పత్రిలో బాధితులను మంత్రి ఎర్రబెల్లి పరామర్శించారు.