గ్రేట్ : ‘హౌదీ మోదీ’ సభలో ట్రంప్ కూడా !

అగ్రరాజ్యం అమెరికాలో స్థిరపడిన భారతీయులను ఉద్దేశించి ప్రధాని మోడీ ‘హౌదీ మోదీ’ సభలో ప్రసంగించనున్నారు. ఈ నెల 22న అమెరికా టెక్సాస్ రాష్ట్రం హ్యూస్టన్‌లో ఈ సభ జరగనుంది. ఈ సభలో పాల్గొనేందుకు ఇప్పటికే 50వేల మంది రిజిస్టర్ చేసుకొన్నారు. ఐతే, ఈ సభలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా పాల్గొననున్నారు. ఈ మేరకు వైట్ హౌస్ ప్రకటన చేసింది. ఇదో చారిత్రక కలయిక. అమెరికాలో స్థిర‌ప‌డ్డ వేలాది మంది భార‌తీయుల‌ను ఉద్దేశించి ఓ అమెరికా అధ్య‌క్షుడు ప్ర‌సంగించ‌డం ఇదే తొలిసారి. ‘హౌదీ మోదీ’ ఈవెంట్‌కు ట్రంప్ రావ‌డం చ‌రిత్రాత్మ‌కం అవుతుంద‌ని అంబాసిడ‌ర్ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ అన్నారు.

ఇంతకీ ట్రంప్ పిలవని పేరంటానికి ఎందుకు వస్తున్నట్టు ? అంటే.. 2020లో అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాలో స్థిరపడిన భారతీయుల మనసులని గెలుచుకొనేందుకు ఇదో మంచి అవకాశంగా ట్రంప్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు.. భారత్-అమెరికా వాణిజ్యసంబంధాలని మరింత సరళతరం చేసేందుకు ట్రంప్ ప్లాన్ చేసినట్టు సమాచారమ్. తద్వారా వచ్చే ఎన్నికల్లోగా భారతీయుల మనసులని గెలవాలని చూస్తున్నారు. ‘హౌదీ మోదీ’ కార్యక్రమంలో ట్రంప్ పాల్గొనడాన్ని ప్రధాని మోడీ కూడా అంగీకరించారు. ఇది ఇరు దేశాల మధ్య మరింత సాన్నిహిత్యం పెంచుతుంది ఆశాభావం వ్యక్తం చేశారు.