పాపం.. కిషన్ రెడ్డికి ఇల్లు కూడా లేదు !
తెలంగాణ భాజాపా సీనియర్ నాయకుడు కిషన్ రెడ్డికి ఈసారి అదృష్టం కలిసొచ్చింది. ఎమ్మెల్యేగా ఓడినా సికింద్రాబాద్ ఎంపీగా గెలిచారు. కేంద్రమంత్రి అయ్యారు. ప్రస్తుతం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఐతే, ఢిల్లీలో కిషన్ రెడ్దికి ఇల్లు లేదు. కొత్త ప్రభుత్వం ఏర్పడి, మంత్రి పదవి వరించి నాలుగు నెలలు గడుస్తున్నప్పటికీ ఆయనకంటూ అధికారిక భవనం లేదు. దాంతో ఆయన ఢిల్లీలోని ఆంధ్రాభవన్ నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు.
కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనకు రెండు భవనాలను ప్రభుత్వం కేటాయించింది. కానీ, వాటిలో అప్పటి కేంద్ర మంత్రులు నివాసం ఉంటున్నారు. వారింకా ఆ బంగ్లాలను ఖాళీ చేయలేదు. కిషన్ రెడ్డికి తుగ్లక్ క్రెస్కెంట్ రోడ్డులో భవనాన్ని కేటాయించారు. ప్రస్తుతం అందులో మాజీ మంత్రి జయంత్ సిన్హా నివాసం ఉంటున్నారు. తనకు కొత్త అధికారిక నివాసం ఏర్పాటు చేయించాల్సిందిగా పట్టణాభివృద్ధి శాఖను ఇప్పటికే సిన్హా కోరారు. దీంతో ఆయనకు పాత భాజపా ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న బంగ్లాను కేటాయించారు. అయితే ఆ బంగ్లాలో భాజపా సీనియర్ నేత రాధామోహన్ సింగ్ నివాసం ఉంటున్నారు.ఈ కారణంగా సిన్హా అధికారిక భవనాన్ని ఖాళీ చేయలేకపోయారు. అందుకే కిషన్ రెడ్డి ఆంధ్రాభవన్ నుంచే విధులు నిర్వర్తించాల్సి వస్తోంది.