శివప్రసాద్ ఇకలేరు !
తెదేపా సీనియర్ నేత, మాజీ ఎంపీ శివప్రసాద్(68) కన్నుమూశారు. ఆయన గతకొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆయన చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరి చికిత్సపొందుతున్నారు. ఐతే, రోజు రోజు ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. శివప్రసాద్ మృతిపట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.
1951 జులై 11న చిత్తూరు జిల్లా పొట్టిపల్లిలో శివప్రసాద్ జన్మించారు. తిరుపతిలోని ఎస్వీ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ అభ్యసించిన శివప్రసాద్.. ఆ తర్వాత రాజకీయ ఆరంగేట్రం చేశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రిగా ఆయన సేవలందించారు. అనేక పార్లమెంటరీ కమిటీల్లో సభ్యుడిగానూ పనిచేశారు. రాష్ట్ర విభజన, ప్రత్యేక హోదా సాధన ఉద్యమాల్లో పార్లమెంటు ప్రాంగణంలో రోజుకొక వేషం వేసి నిరసన తెలిపారు.
స్వతహాగా శివప్రసాద్ రంగస్థల నటుడు. ఎన్నో వేదికలపై ప్రదర్శనలు ఇచ్చారు. ఆ తర్వాత సినిమా రంగంలోకి ప్రవేశించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, ప్రతినాయకుడిగా పలు చిత్రాల్లో నటించారు. కొన్ని చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. తులసి, దూసుకెళ్తా, ఆటాడిస్తా, మస్కా, కుబేరులు, ఒక్కమగాడు, కితకితలు, డేంజర్, ఖైదీ చిత్రాల్లో ఆయన నటించారు. ప్రేమ తపస్సు, టోపీ రాజా స్వీటీ రోజా, ఇల్లాలు, కొక్కొరొకో చిత్రాలకు శివప్రసాద్ దర్శకత్వం వహించారు.
రంగస్థల, సినీ నటుడిగా కూడా శివప్రసాద్ రాణించారు.