ఇమ్రాన్ ఖాన్, మోడీతో ట్రంప్ భేటీ !
ఆదివారం హ్యూస్టన్ లో జరిగే ‘హౌడీ-మోదీ’ కార్యక్రమానికి ట్రంప్-మోదీ హాజరుకానున్నారు. హ్యూస్టన్ లోని ఎన్ ఆర్జీ స్టేడియం వేదికగా జరిగే ఈ కార్యక్రమానికి అమెరికా వ్యాప్తంగా సుమారు 50వేల మంది ప్రవాస భారతీయులు హాజరు కానున్నారు. అమెరికాలోని అత్యున్నత స్థాయి అధికారులు కూడా ఇందులో పాల్గొంటారు. ఈ సమావేశం తర్వాత ట్రంప్ పాక్, భారత్ ప్రధానులతో భేటీ కానుండటం ప్రాధాన్యతని సంతరించుకొంది. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో సోమవారం భేటీ కానున్నారు.
న్యూయార్క్ లో వీరిద్దరి భేటీ జరగనుంది. ఇక భారత ప్రధాని నరేంద్ర మోదీతో ట్రంప్ మంగళవారం సమావేశం కానున్నారు. ఇందుకు కూడా న్యూయార్క్ వేదిక కానుంది. ఈ సందర్భంగా పలు ద్వైపాక్షిక, రక్షణ సంబంధ ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పాక్-భారత్ మధ్య సమస్యల పరిష్కారానికి ట్రంప్ ఏమైనా కృషి చేస్తారా ? అన్నది చర్చనీయాంశంగా మారింది.