చంద్రబాబు నివాసం కూల్చివేత


ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం అనుకున్నదే చేసింది. కృష్ణానది కుడిగట్టు కరకట్టపై తెదేపా అధినేత చంద్రబాబు అద్దెకు ఉంటున్న నివాసాన్ని సీఆర్ డీఏ అధికారులు కూల్చివేస్తున్నారు. మూడురోజుల క్రితమే చంద్రబాబు నివాసం ఉంటున్న ఇంటియజమాని లింగమనేని రమేశ్ కు సీఆర్ డీఏ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. వారంరోజుల్లోగా కట్టడాలనుకూల్చివేయాలని, లేదంటే తామే కూల్చివేస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు. తాజాగా చంద్రబాబు నివాసంతో పాటు మరో రెండు ఇళ్లని సీఆర్ డీఏ అధికారులు కూల్చేందుకు రెడీ అవుతున్నారు.

కృష్ణా కరకట్టపై నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన 31 కట్టడాలకు సీఆర్ డీఏ అధికారులు గతంలో ప్రాథమిక నోటీసులిచ్చారు. తర్వాత వారిని పిలిపించి వాదనలు విన్నారు. 20 కట్టడాలకు సంబంధించిన వారి వాదనలు విని, 5 కట్టడాలను కూల్చివేయాలని నిర్ణయించి తుది నోటీసులు జారీచేశారు. వారం రోజుల్లో ఆ కట్టడాలను వారే కూల్చివేయాలని.. లేకపోతే సీఆర్ డీఏ చర్యలు తీసుకుంటుందని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. వీటిలో శివస్వామి ఆశ్రమంలో ఉన్న 2 కట్టడాలు, ఆక్వాడెవిల్స్ పేరుతో ఉన్న ఒక కట్టడం, మరో 3 అంతస్తుల భవనం ఉన్నాయని అధికారులు తెలిపారు.