‘సైరా’ రావడానికి రాజమౌళినే కారణం : చిరు
దర్శకధీరుడు రాజమౌళి కారణంగానే ‘సైరా’ సినిమా సాధ్యమైంది అన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన కథానాయకుడుగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సైరా’. తొలితరం స్వాత్రంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. దాదాపు రూ. 250కోట్ల బడ్జెట్ తో రామ్ చరణ్ నిర్మించారు. అక్టోబర్2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆదివారం హైదరాబాద్ లోని ఎల్భీ స్టేడియంలో సైరా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా మాట్లాడిన మెగాస్టార్ చిరంజీవి సైరా రాకకు దర్శకుడు రాజమౌళినే కారణం అన్నారు. దాదాపు 20యేళ్ల క్రితమే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ విన్నాను. బాగా నచ్చేసింది. కానీ బడ్జెట్ ఇబ్బందుల వలన చేయలేకపోయాయ్. 15 సంవత్సరాల క్రితం నా సినిమా బడ్జెట్ రూ. 30కోట్లు. కానీ ఉయ్యాలవాడ సినిమా తీయాలంటే ఆ కాలంలోనే రూ. 70కోట్లకిపైగా కావాలి. దీంతో నిర్మాతలు ఎవరు ముందుకు రాలేదు. ఐతే, సైరా సినిమా రావడానికి పరోక్షంగా సపోర్ట్ చేసింది దర్శకుడు రాజమౌళినే. ఆయన గనక బాహుబలి తీసి ఉండకపోతే.. ఈరోజు సైరా వచ్చేది కాదు. ఆయన మన తెలుగు సినిమాకి భారతదేశ వ్యాప్తిగా ఓ దారి వేశారు. కొన్ని వందల కోట్లు ఖర్చు చేసినా సరే.. అంతకు అంత రాబట్టవచ్చని ఆయన నిరూపించాడు. హ్యాడ్సాఫ్ టు రాజమౌళి అన్నారు చిరు.