భాగ్యనగరంలో భారీ వర్షం
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. మంగళవారం సాయంత్రం, అర్థరాత్రి దాటాక వరుణుడు ప్రతాపం చూపించారు. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో 12సెం. మీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఎస్ ఆర్ నగర్, కూకట్ పల్లి, బాలానగర్, పంజాగుట్ట, బెంగంపేట్, లక్డికాపూల్, వనస్థలిపురం, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఎల్బీనగర్, కుత్బుల్లాపూర్, సుల్తాన్ బజార్, పాతబస్తీ, మలక్ పేట్, బోరబండ, మోతీనగర్, ఈఎస్ఐ, అమీర్ పేట్, హైదర్ నగర్, బొంగులూరు ఓఆర్ఆర్ తదితర ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. మంగళవారం సాయంత్రం కురిసిన వర్షానికి రహదారులన్నీ గోదారిని తలపించాయి.
వాహనచోదకులు, ప్రయాణికులు ఎక్కడికక్కడే నిలిచిపోయారు. వర్షం ఆగిపోయినా రహదారులపై నీళ్లు అలాగే ఉండడంతో బస్సులు, కార్లు, ఆటోలు ఆగిపోయాయి. గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించింది. ప్రధానంగా తాడ్‌బండ్ నుంచి సుచిత్ర వరకూ పది కిలోమీటర్ల మార్గంలో రెండు వైపులా వాహనాలు నిలిచిపోగా ప్రయాణికులు, చోదకులు ప్రత్యక్ష నరకం చూశారు. గచ్చిబౌలి, ఐకియా, శిల్పారామం, హైటెక్‌సిటీ, మాదాపూర్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వరకూ కార్లు, బస్సులు.. ద్విచక్రవాహనాలు వేలసంఖ్యలో ఆగిపోయాయి.. ట్రాఫిక్ పోలీసులు మ్యాన్‌హోళ్లను తెరిచి వాననీటిని పంపగా అప్పుడు వాహనాలు కదిలాయి.