చిరుని కలిసిన ఉయ్యాలవాడ వంశీయులు.. వివాదం ముగిసినట్టేనా ?


మెగాస్టార్ చిరంజీవిని ఉయ్యాలవాడ వంశీయులు కలిశారు. మంగళవారం సాయత్రం కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ మండలం రూపనగుడి గ్రామానికి చెందిన నరసింహారెడ్డి వంశస్థులు చిరు ఇంటికి వచ్చి కలిశారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథని తెరకెక్కిస్తున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు. కోవెలకుంట్లలోని జుర్రేరు, కుందూ నదులు కలిసే ప్రదేశంలో ఏర్పాటు చేస్తున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి శృతి వనం ప్రారంభోత్సవానికి రావాలని మెగాస్టార్ ని ఆహ్వానించగా.. ఆయన ఓకే చెప్పినట్టు తెలిసింది.కర్నాటి వంశస్థులునారాయణరెడ్డి, జగన్‌ మోహన్‌రెడ్డి, మధుసూదనరెడ్డి, ప్రతాపురెడ్డి తదితరులు కుటుంబ సభ్యులతో కలిసి చిరుని కలిశారు. దీంతో సైరా సినిమాపై ఉయ్యాలవాడ వంశీయులు చేస్తున్న ఆందోళనకి తెరపడినట్టేనా ? అంటే కాదని చెప్పాలి.

ఎందుకంటే ? మెగాస్టార్, ఆయన తనయుడు రామ్ చరణ్ పై ఆరోపణలు చేసిన వ్యక్తులు మెగాస్టార్ ని కలిసిన వాళ్లలో లేరు. సైరా సినిమా కోసం తమని వాడుకొన్నారు. తమ నుంచి ఉయ్యాలవాడ జీవిత విశేషాలని తెలుసుకొన్నారు. షూటింగ్ కోసం తమ భూములని వాడుకొన్నారు. ఆ సమయంలో తమకు న్యాయం చేస్తామని రామ్ చరణ్ హామీ ఇచ్చారు. దాదాపు రూ. 50కోట్ల డీల్ జరిగిందని ఆందోళనకి దిగిన ఉయ్యాలవాడ వంశీయులు ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై చిత్రబృందం నుంచి స్పందన లేకపోవడంతో హైకోర్టుకి వెళ్లారు. మరీ.. న్యాయస్థానం సైరా వివాదంపై ఏ తీర్పునిస్తుంది అనేది చూడాలి.
 
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సైరా తెరకెక్కింది. తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. ఇందులో నరసింహారెడ్డిగా చిరు, ఆయన గురువు పాత్రలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నటించారు. నయనతార, తమన్నా, అనుష్క, జగపతి బాబు, నిహారిక, కిచ్చ సుధీప్, విజయ్ సేతుపతి తదితరులు కీలక పాత్రలో  నటించారు. ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతం అందించారు. రామ్ చరణ్ నిర్మించారు.