తీవ్ర వెన్నునొప్పితో బాధపడుతున్న పవన్
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు మళ్లీ వెన్నునొప్పి తీవ్రమైంది. దీంతో గత మూడ్నాలుగు రోజులుగా ఆయన ఇంటి నుంచి బయటికి వెళ్లడం లేదు. ఈ నేపథ్యంలో విజయవాడలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి పవన్ హాజరు కాలేకపోతున్నాడు. ఈ మేరకు పవన్ ఓ ప్రకటన చేశారు. సమావేశానికి రాలేకపోతున్నందుకు గల బలమైన కారణాలని వివరించారు.
“విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి, దానికి నన్ను ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు. మీడియా స్వేచ్ఛకోసం పోరాటం చేస్తున్న మీకు జనసేన మద్దతు ఎప్పుడూ ఉంటుంది. అయితే, ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల నేను ఈ సమావేశానికి హాజరుకాలేకపోతున్నా.’గబ్బర్‌సింగ్’ షూటింగ్ సమయంలో వెన్ను పూసలకు తీవ్ర గాయాలు కావడంతో తరచూ నన్ను వెన్ను నొప్పి బాధిస్తోంది. ఇటీవల ఎన్నికల ప్రచార సమయంలో అశ్రద్ధ చేయడం వల్ల గాయాల నొప్పి తీవ్రత పెరిగింది. డాక్టర్ సర్జరీకి వెళ్లమని సలహా ఇచ్చినప్పటికీ, సంప్రదాయ వైద్యంపై నమ్మకంతో ఆ దిశగానే ముందుకు వెళ్తున్నా. గత కొన్ని రోజులుగా వెన్ను నొప్పి తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. చికిత్స తీసుకుంటున్నా. ఈ కారణంగానే గత మూడు రోజులుగా ఎటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. అయితే, జనసేన తరపున పార్టీ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటారు. అభినందనలతో పవన్‌కల్యాణ్” అని పేర్కొన్నారు.