అయోధ్య కేసుకు సుప్రీం డెడ్ లైన్ !


అయోధ్య కేసు విషయంలో సుప్రీం కోర్ట్ డెడ్ లైన్ విధించింది. అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదం పై విచారణను అక్టోబరు 18 నాటికి పూర్తి చేయాల్సిందేనని సుప్రీంకోర్టు మరోసారి తేల్చిచెప్పింది. ఆలోగా ఇరు పక్షాలు వాదనలు వినిపించాలని, అంతకు మించి ఒక్కరోజు కూడా అదనంగా ఇవ్వడం కుదరదని న్యాయస్థానం స్పష్టం చేసింది.

అక్టోబరు 18 నాటికి వాదనలు పూర్తయిన తర్వాత తీర్పు వెల్లడించడానికి ధర్మాసనానికి 4వారాల సమయం మాత్రమే ఉందని ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్‌ రంజన్ గొగొయి తెలిపారు. ఆ 4 వారాల్లో తీర్పు వెల్లడిస్తే న్యాయస్థానం అద్భుతం సాధించినట్లేనని అన్నారు. నవంబరు 17తో జస్టిస్‌ రంజన్‌ గొగొయి పదవీకాలం ముగియనుంది. ఆలోపే తీర్పు వెలువడే అవకాశముంది. అవసరమనుకుంటే మధ్యవర్తిత్వ ప్రక్రియను కూడా పునఃప్రారంభించుకోవచ్చని సూచించింది.