షాకింగ్ : సైరా బయోపిక్ కాదట ! ఇంకా సెన్సార్ కాలేదట !!


సురేంధర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం ‘సైరా’. తొలితరం స్వాత్రంత్య్ర సరమయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. దీంతో ఇది ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ గా అందరు భావిస్తున్నారు. కానీ సైరా బయోపిక్ కాదట. ఈ విషయాన్ని దర్శకుడు సురేంధర్ రెడ్డి కోర్టుకి తెలిపారు.

సైరా సినిమాపై ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వారసులు ఆందోళన చేస్తున్నారు. తమ అనుమతి లేకుండా ఈ చిత్ర విడుదలను, సెన్సార్‌ సర్టిఫికెట్‌ జారీ చేయడాన్ని నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వారసులు తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. గురువారం ఈ కేసు విచారణ జరిగింది. 

ఈ చిత్రానికి ఎలాంటి సర్టిఫికెట్‌ ఇవ్వలేదని సెన్సార్‌బోర్డు కోర్టుకు తెలిపింది. సోమవారంలోపు తమ నిర్ణయం తెలియజేస్తామని వెల్లడించింది. దీంతో తదుపరి విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఈ సందర్భంగా దర్శకుడు సురేందర్‌రెడ్డి న్యాయమూర్తి ఎదుట తన వాదనలు వినిపించారు. ‘సైరా’ అసలు బయోపిక్‌ కాదని కోర్టుకు తెలిపారు. ఇది ప్రేక్షకులని షాక్ కి గురి చేస్తోంది. మొదటి నుంచి సైరా ఉయ్యాలవాడ బయోపిక్ గా భావిస్తున్నారు. ఇక ఇప్పటికే సైరా సెన్సార్ పూర్తయిందని, యు/ఎ సర్టిఫికెట్ వచ్చిందని చిత్రబృందం తెలిపింది. ఇప్పుడీ ఈ రెండు విషయాల్లో వాస్తవం లేదని తెలుస్తోంది. మరీ సోమవారం సైరా విషయంలో కోర్టు ఎలాంటి తీర్పునిస్తుందో చూడాలి.