వేణు మాధవ్ ని కడసారి చూసేందుకు.. !

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న హాస్యనటుడు వేణు మాధవ్ గురువారం సికింద్రాబాద్ యశోద హాస్పటల్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయన అంత్యక్రియలు మరికొద్దిసేపట్లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వేణు మాధవ్ ని కడసారి చూసేందుకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

ఈ ఉదయం వేణు మాధవ్ మృతదేహాన్ని అభిమానుల సందర్శణార్థం హైదరాబాద్ ఫిల్ ఛాంబర్ కి తీసుకొచ్చారు. అక్కడ దాదాపు రెండు గంటల పాటు ఉంచారు. అనంతరం మళ్లీ మౌలాలీకి తరలించి అక్కడ స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించన్నారు.ఫిల్మ్ ఛాంబర్ వద్ద మంత్రి తలసాని, చిరంజీవి, మురళీమోహన్‌ తదితరులు వేణు మాదవ్ కి నివాళులు అర్పించారు.

వేణు మాధవ్ మృతదేహాన్ని చూడ్డానికి వచ్చిన తనని సొంత చెల్లెలుగా చూసుకొనేవారని.. యాంకర్ ఉదయభాను కన్నీరు పెట్టుకొన్నారు. ‘వన్స్ మోర్ ప్లీజ్’ అనే టీవీ కార్యక్రమంలో ఉదయభాను వేణు మాధవ్ తో కలిసి చేయగా అప్పట్లో ఆ షో కు విపరీతమైన క్రేజ్ ఉండేది. వేణు మాధవ్‌ను ఉద్దేశించి నటుడు ఉత్తేజ్‌ భావోద్వేగంతో ఓ లేఖను రాశారు.

‘మిస్‌ యూ వేణూ..!
చాలా మంచోడివి డార్లింగ్‌ నువ్వు..
ఎన్ని నవ్వుల్ని పంచావ్‌..
ఎన్ని అనుభూతుల్ని పంచుకున్నావ్‌..
ఒకటా..! రెండా..!!
నీతో గడిపిన ప్రతిక్షణం
గుర్తుండిపోయేలా చేయడం నీకే సాధ్యం..
కలిసి అమలాపురమెళ్లినా..
కలిసి అమెరికా వెళ్లినా..
నువ్వు మారవ్‌.. నీ స్నేహం మారదు.. నీ తీరు మారదు.. నీ వ్యక్తిత్వం మారదు..
నీతోపాటు పదిమందీ బావుండాలి..
షూటింగ్స్‌లో బిజీగా ఉండాలి..
పదిమందితో కలిసి భోజనం చేయాలి.. అందరూ పచ్చగా ఉండాలి అని కోరుకునే స్నేహ పిచ్చోడివి..
అందరి గురించీ ఆలోచిస్తూ..
‘నీ’ గురించి ఆలోచించుకోకే.. ఇలా జరిగిందేమో..!
నా చివరంటా గుర్తుంటావ్‌.. లవ్‌ యూ’

వేణుమాధవ్ ఇప్పటివరకు 600 సినిమాల్లో నటించారు. తొలిప్రేమ, దిల్, లక్ష్మి, సై, ఛత్రపతి చిత్రాలు మంచిపేరు తీసుకొచ్చాయి. 2006లో లక్ష్మి సినిమాకు ఉత్తమ హాస్యనటుడిగా నంది పురస్కారాన్ని కూడా వేణుమాధవ్ అందుకున్నారు