బ్రేకింగ్ : ఈఎస్ఐ డైరెక్టర్ దేవికారాణి అరెస్ట్


తెలంగాణలో ఈఎస్ఐ డైరెక్టర్ దేవికారాణిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆమెతో మరో ఆరుగురిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. వీరందరినీ బంజారాహిల్స్ లోణి ఏసీబీ కార్యాలయానికి తీసుకెళ్లారు. ఈఎస్ఐ ఉద్యోగులే బినామీలుగా రూ. 200 కోట్ల మెడిసిన్ స్కామ్‌కు పాల్పడినట్లు దేవికారాణిపై ఆరోపణలున్నాయి. ఈఎస్ఐ మందులతో పాటు, వైద్య పరికరాల కొనుగోళ్లలో భారీగా అక్రమాలు బయటపడ్డాయి. గత రెండ్రోజులుగా దేవికారాణి ఇంట్లో ఏసీబీ అధికారులు చేపట్టిన సోదాల్లో పలు డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఇక శుక్రవారం ఉదయం దేవికారాణికి ఏసీపీ అధికారులు అదుపులోనికి తీసుకున్నారు.

2018 నవంబర్ 3న విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌కు ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫిర్యాదు చేయడంలో.. ఈ స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఏసీబీ సోదాల్లో దేవికారాణికి అనేక బినామి కంపెనీలు ఉన్నాయని.. మందుల కొనుగోళ్లలో వందల కోట్ల కుంభకోణం చేసినట్లు అధికారులు గుర్తించారు. 2015 నుంచి 2018 వరకు ప్రభుత్వానికి రూ.12.50 కోట్ల నష్టం కలిగించినట్లుగా తెలుస్తోంది. తాజాగా దేవికారాణితో పాటుగా జాయింట్ డైరెక్టర్ పద్మ, అసిస్టెంట్ డైరెక్టర్ వసంత ఇందిర, ఫార్మసిస్ట్ రాధికా, ఉద్యోగి నాగరాజు, సీనియర్ అసిస్టెట్ హర్షవర్ధన్, ఓమ్ని మెడికల్ కంపెనీ ఎండీ శ్రీహరిలని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.