కేసీఆర్ నామినేటెడ్ టాస్క్.. గెలిచేదెవరు ?
తెరాస అధినేత, సీఎం కేసీఆర్ ఎన్నికల వ్యూహాలు పక్కాగా ఉంటాయి. అందుకే ఆయన పార్టీని రెండుసార్లు అధికారంలోకి తీసుకొచ్చారు. ముందస్తు మంచిది కాదు. ముందస్తుకి వెళ్లిన పార్టీలేవీ బాగుపడ్డ దాఖలు లేవని చరిత్ర చెబుతున్నా.. దైర్యంగా ముందస్తుకి వెళ్లారు. భారీ మెజారిటీతో మళ్లీ అధికారంలోకి వచ్చారు. తెరాస ముందు ఉన్న తదుపరి టార్గెట్ మున్సిపల్ ఎన్నికలు.
ఈ ఎన్నికల కోసం బాగా పనిచేసిన వారికే నామినేటెడ్ పోస్టులు ఇస్తామని సీఎం కేసీఆర్ సంకేతాలిచ్చినట్టు సమాచారమ్. తెరాస రెండోసారి అధికారంలోకి వచ్చి దాదాపు 10 నెలలు అయినా నామినేటెడ్ పోస్టుల భర్తీ మాత్రం ఇంకా పూర్తి చేయలేదు. ఇటీవల జరిగిన తెలంగాణ కేబినెట్ విస్తరణ సమయంలో తెరాస నేతలకు పదవుల జాతర అంటూ సీఎం కేసీఆర్ ప్రకటించారు.
12 మంది ఎమ్మెల్యేలకు కార్పొరేషన్ పదవులు, మరికొంతమందికి రాజ్యసభ సీట్లు, ఇంకొందరికి ఖాళీ కాబోతున్న ఎమ్మెల్సీ సీట్లు, మిగిలిన నేతలకు ఉన్నత పదవులు ఇస్తామని తెలిపారు. అయితే కేబినెట్ విస్తరణ తర్వాత అటు అసెంబ్లీ, ఇటు మండలిలో విప్, చీఫ్ విప్ పదవులు మినహా మరేవీ భర్తీ చేయలేదు. ముందు మున్సిపల్ ఎన్నికలు ఉండటంతో ఆ తర్వాత నామినేటెడ్ పోస్టుల భర్తీ ఉండనుందని స్పష్టం చేశారు. అంతేకాదు.. మున్సిపల్ ఎన్నికల్లో బాగా పనిచేసినవారికే నామినేటెడ్ పదవులు ఇస్తామని సీఎం టాస్క్ ఇచ్చినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో.. తమని తాము నిరూపించుకొనే పనిలో నేతలు ఉన్నారు.