‘సైరా’ వివాదంపై హరీష్ కామెంట్స్


మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ ప్యాన్ ఇండియా సినిమాగా ఈ వారమే (అక్టోబర్ 2)న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఐతే, సైరా విడుదలని అడ్డుకోవాలని ఉయ్యాలవాడ వారసులు కోర్టు మెట్లు ఎక్కిన సంగతి తెలిసిందే. సైరా విషయంలో తమకి అన్యాయం జరిగింది. తమ నుంచి చిత్రబృందం ఉయ్యాలవాడ జీవిత విశేషాలని తెలుసుకొన్నారు. షూటింగ్ కోసం తమ భూములని వినియోగించు కోనున్నారు. ఆ సమయంలో తమకి ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో సైరా విడుదలకి అడ్డుకోవాలని ఉయ్యాలవాడ వారసులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఈరోజు కోర్టు తీర్పునివ్వనుంది.

ఈ నేపథ్యంలో సైరా చిత్రబృందానికి మద్దతుగా దర్శకుడు హరీష్ శంకర్ నోరు విప్పారు. “బేసిగ్గా చిరంజీవి గారు సినిమా ప్రకటన చేసేంత వరకు నాకు ఉయ్యాలవాడ నరసింహారెడ్ది అంటే ఎవరో తెలీదు. నాలాంటోళ్లు కూడా చాలామంది ఉన్నారన్నది నా ఫీలింగ్. చిరంజీవిగారు సైరా సినిమా చేయడం మూలంగానే.. నరసింహారెడ్డి గొప్పతనం మనకి తెలిసింది. ఫ్యామిలీకి సంబంధించిన గొప్పవ్యక్తి మీద కనుకగా సినిమా చేస్తే.. తాను చిరంజీవి కాళ్లు కడిగి ఆ నీళ్లు నెత్తిమీద చల్లుకుంటా. ఆయన వలన మా కుటుంబానికి గుర్తింపు వస్తుందని ఫీలవుతా. అటన్ బరో గాంధీ మీద సినిమా తీస్తే.. గాంధీ మా జాతిపిత అని భారతదేశం మొత్తం ఆయన్ని డబ్బులు అడిగిందా ? మన గర్వంగా ఫీలయ్యాం. అటన్ బరోకి సలాం కొట్టాం మనం. అటన్ బరో లాంటోళ్లు వచ్చి మన గాంధీ మీద సినిమా తీయొచ్చు. మనం  ఇక్కడ ఉన్నోళ్లం.. మన తెలుగువాళ్ల మీద సినిమా తీయడానికి లక్షా తొమ్మిది పంచాయతీలు” అంటూ తనదైన శైలిలో స్పందించారు. ఇవన్నింటిని దాటుకొంటూ సైరా బ్లాక్ బస్టర్ హిట్ కావాలని కోరుకొన్నారు.