తెదేపాకు గుడ్ బై చెప్పిన దేవేందర్‌గౌడ్‌ ఫ్యామిలీ 


టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి దేవేందర్‌గౌడ్‌ చాన్నాళ్ల నుంచి రాజకీయాలకి దూరంగా ఉంటున్నారు. ఆయన సాంకేతికంగా టీడీపీ లోనే ఉన్నా.. అనారోగ్య కారణాలవలన ఇన్నాళ్లు యాక్టివ్ గా లేరు. ఆయన కొడుకు తూళ్ల వీరేందర్‌గౌడ్‌ మాత్రం తెదేపా యాక్టివ్ గా పనిచేస్తున్నారు. తెలంగాణ తెలుగు యువత అధ్యక్షుడిగా ఉన్నారు. తాజాగా వీరేందర్‌గౌడ్‌ టీడీపీ పార్టీకి, తెలుగు యువత అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖని అధినేత చంద్రబాబుకు పంపారు.

ఉన్నత ఆదర్శాలు, సిద్ధాంతాలతో ఎన్టీఆర్‌ టీడీపీని స్థాపించారని, ఐతే, కొంత కాలంగా వివిధ రాజకీయ అవసరాల కోసం ఈ సిద్ధాంతా లకు భిన్నంగా టీడీపీ రాజీపడిందని, ఇది తనను ఎంతగానో బాధించిందన్నారు. పార్టీకి సిద్ధాంతాలు లేక పోవడం ఆత్మ లోపించడమేనని, ఈ నేపథ్యంలో తాను పార్టీ సభ్యత్వానికి, తెలంగాణ తెలుగు యువత అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు తూళ్ల వీరేందర్‌గౌడ్‌ రాజీనామా లేఖలో పేర్కొన్నారు. అసలు విషయం మాత్రం వేరే ఉంది. దేవేందర్‌గౌడ్‌, ఆయన తనయుడు వీరేందర్‌గౌడ్‌ త్వరలోనే బీజేపీలో చేరేందుకు రెడీ అవుతున్నారు. మున్సిపల్ ఎన్నికలకి ముందే వీరు కమలం గూటికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.