అఫిషియల్ : కారుకే కామ్రేడ్స్ సపోర్ట్

హుజూర్ నగర్ ఉప ఎన్నికలో తెరాసకి మద్దతు ఇచ్చేందుకు సీపీఐ అంగీకరించింది. ఈ మేరకు ఆ పార్టీ అధికారిక ప్రకటన చేసింది. ఆదివారం తెరాస కీలక నేతలు సీపీఐ నేతలతో సమావేశమై.. హుజూర్ నగర్ ఉప ఎన్నికలో తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే సూచనప్రాయంగా అంగీకరించిన సీపీఐ.. తాజాగా కారుకు సపోర్ట్ ఇస్తున్నట్టు అధికారిక ప్రకటన చేసింది. మంగళవారం సమావేశమైన సీపీఐ రాష్ట్ర కార్యవర్గం సుదీర్ఘ చర్చల అనంతరం తెరాసకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. సీపీఐ మద్దతుతో హుజూర్ నగర్ లో తెరాసకి మరింత బలం పెరిగినట్టయింది.

ఇక హుజూర్ నగర్ బరిలో దాదాపు 200మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఐతే, ప్రధానమైన పోటీ మాత్రం తెరాస, కాంగ్రెస్, భాజాపాల మధ్య ఉండనుందని చెబుతున్నారు. గత యేడాది చివర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలుపొందిన సంగతి తెలిసిందే. ఐతే, ఆ తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికలో ఆయన నల్గొండ ఎంపీగా గెలిచారు. ఈ నేపథ్యంలో ఆయన హుజూర్ నగర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో హుజూర్ నగర్ ఉప ఎన్నిక అనివార్యం అయింది.