టీమిండియాకు నెం.4 అవసరం లేదట !
టీమిండియాకు నెం.4 సమస్యకు ఇంకా పరిష్కారం దొరకలేదు. వరల్డ్ కప్ కి ముందు తర్వాత కూడా నెం.4 సమస్య కోహ్లీ సేనని వేధిస్తోంది. ఐతే, ఇదంతా సొంత అపరాధమే అంటున్నారు మాజీలు. ఈ నేపథ్యంలో భారత క్రికెటర్ హర్భజన్ సింగ్ సోమవారం చేసిన ఓ ట్వీట్‌కు మాజీ క్రికెటర్ యువరాజ్‌సింగ్ తనదైన శైలిలో వ్యంగ్యంగా సమాధానమిచ్చాడు.
విజయ్‌హజారే ట్రోఫీలో అద్భుత బ్యాటింగ్ చేసిన సూర్యకుమార్(81; 31 బంతుల్లో, 8×4, 6×6) ఫొటోని పోస్టు చేసిన భజ్జీ.. దేశవాళి క్రికెట్‌లో మంచి ప్రదర్శన చేసినా ఈ ఆటగాడిని భారత జట్టుకు ఎందుకు ఎంపిక చేయలేదో అర్థంకాలేదని వ్యాఖ్యానించాడు. సూర్యకుమార్ ఇలాగే నిరంతరం కష్టపడితే ఏదో ఒకరోజు అతడికి అవకాశం వస్తుందని భజ్జీ పేర్కొన్నాడు. ఇది చూసిన యువీ.. ‘నేను నీకు ముందే చెప్పాను, వాళ్లకి(టీమిండియా) నాలుగో నంబర్ ఆటగాడు అవసరం లేదు. టాప్ ఆర్డర్ చాలా బలంగా ఉంది’ అంటూ నవ్వుతున్న ఎమోజీతో రిప్లై ఇచ్చాడు. ఇప్పుడీ ట్విట్స్ వైరల్ అవుతున్నాయ్. యువీ చెప్పిన దాంట్లో నిజంలేకపోలేదు. ఎందుకంటే ? నెం.4 సుధీర్ఘ కాలంగా వేధిస్తున్న సమస్య. దానికి ఇప్పటికి సమాధానం దొరకపోవడం ఆశ్చర్యం కలిగించేదే.