రివ్యూ : సైరా

చిత్రం : సైరా నరసింహారెడ్డి

నటీనటులు : చిరంజీవి, అమితాబ్‌ బచ్చన్‌, నయనతార, జగపతిబాబు, తమన్నా, సుదీప్‌, విజయ్‌ సేతుపతి, అనుష్క, రవికిషన్‌, నిహారిక, బ్రహ్మానందం, రఘుబాబు, బ్రహ్మాజీ తదితరులు

సంగీతం : అమిత్‌ త్రివేది, జూలియస్‌ ఫాఖియం(నేపథ్య సంగీతం)

దర్శకత్వం : సురేందర్‌రెడ్డి

నిర్మాత : రామ్‌ చరణ్‌

విడుదల తేదీ :  అక్టోబర్ 2, 2019

రేటింగ్ : 3/5/5

తెలుగు సినిమాకు ఊపుని తీసుకొచ్చిన కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి. అదిరిపోయే స్టెప్పులేసి, ఫైట్స్ చేసి ప్రేక్షకులని ఉర్రూతలూగించాడు. 149 సినిమాలు చేశాక రాజకీయాల్లోకి వెళ్లాదు. దాదాపు 11యేళ్ల గ్యాప్ తర్వాత ‘ఖైదీ నెం.150’తో రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాతో ఇప్పటికీ టాలీవుడ్ అసలైన మెగాస్టార్ అని నిరూపించుకొన్నాడు. ఖైదీ నెం. 150 బ్లాక్ బస్టర్ హిట్ అయింది. నాన్ బాహుబలి రికార్డులని కొల్లగొట్టింది. అంతకుమించి చిరు ఏమాత్రం జోష్ తగ్గలేదు. అదే స్టయిల్, అదే ఊపు అని నిరూపించింది.

ఇక 151వ సినిమాగా చిరు తన డ్రీమ్ పాజెక్ట్ ని ఎంచుకొన్నారు. అదే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ. కర్నూలు ప్రాంతానికి చెందిన తొలితరం స్వాత్రంత్య్ర సమరయోధుడు ఆయన. చరిత్రపుట్టల్లో కనుమరుగైన ఈ ధీరుడి కథపై చిరు మనసుపడ్డారు. 12యేళ్ల క్రితమే చిరు ఈ సినిమా చేయాల్సి ఉంది. భారీ బడ్జెట్ అవుతుందనే కారణంతో వాయిదా వేస్తూ వచ్చారు. చిరు కోరికని తీర్చడానికి ఆయన తనయుడు, మెగాస్టార్ రామ్ చరణ్ ముందుకొచ్చారు. దాదాపు రూ. 250కోట్లతో సైరాని తెరకెక్కించారు. ఈ సినిమా చరణ్ కమర్షియల్ గా చూడలేదు. తండ్రికి ఇవ్వబోతున్న గిఫ్ట్ గా భావించారు. మరీ.. ఆ గిఫ్ట్ ఎలా ఉంది. సైరా ప్రేక్షకులని ఏ మేరకు మెప్పించింది. తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !

కథ : 

రేనాడు ప్రాంతాన్ని 61మంది పాలెగాళ్లు చిన్న చిన్న సంస్థానాలుగా చేసుకుని పరిపాలన సాగిస్తుంటారు. ఐతే, ఎవరి మధ్యా ఐకమత్యం ఉండదు. ఒకరంటే ఒకరికి పడదు. రేనాడుపై పన్ను వసూలు చేసుకునే హక్కు  ఆంగ్లేయులు పొందడంతో ఎవరికీ స్వయం పాలన ఉండదు. మరోవైపు, వర్షాలు లేక, పంటలు పండక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. పంటలు పండకపోయినా పన్నులు కట్టాలని ప్రజలను ఆంగ్లేయులు హింసిస్తుంటారు. అలాంటి సమయంలో మజ్జారి నరసింహారెడ్డి అనే పాలెగాడు ఆంగ్లేయులపై ఎలా పోరాటం చేశాడు ? ఐకమత్యం కొరవడిన 61మంది పాలెగాళ్లను ఎలా ఏకతాటిపైకి తీసుకొచ్చాడు? వీరారెడ్డి (జగపతిబాబు), అవుకు రాజు (సుదీప్), పాండిరాజా (విజయ్ సేతుపతి), లక్ష్మి(తమన్నా)లు తొలి స్వాతంత్య్ర పోరాటంలో నరసింహారెడ్డికి ఎలా సహకరించారు? అన్నది సైరా కథ.

ప్లస్ పాయింట్స్ :

* చిరు నటన

* కథ-కథనం

* నేపథ్య సంగీతం

* భాగోద్వేగాలు

* యుద్ధ సన్నివేశాలు

మైనస్ పాయింట్స్ :

* సినిమా ప్రారంభంలో కొన్ని సన్నివేశాలు

ఎలా సాగిందంటే ?

సైరాలో అనుష్క కీలక పాత్రలో నటించారని తెలుసు. కానీ, టీజర్, ట్రైలర్, మేకింగ్ వీడియోలు ఎక్కడా ఆమె లుక్కుని రిలీజ్ చేయలేదు. ఆ పాత్ర ఏంటన్నది బయటికి రాకుండా జాగ్రత్తపడ్డారు. అలా ఎందుకు చేశారు ? అన్నది సినిమా చూశాక అర్థమవుతోంది. లక్ష్మీబాయి(అనుష్క)పై  ఆంగ్లేయులు దాడి చేయటంతో కథ ప్రారంభమవుతుంది. తొలి స్వాతంత్య్ర పోరాటం చేస్తున్నది మనం కాదని, అంతకుముందే ఆంగ్లేయులను ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనే వ్యక్తి గడగడలాడించాడని అతని గురించి లక్ష్మీబాయి తన సైనికులకు వివరించడంతో సైరా కథ మొదలవుతుంది.

తొలిభాగంలో ఆనాటి పరిస్థితులు, పంటలు పండకపోయినా పన్నులు కట్టాలని ఆంగ్లేయులు ప్రజలను హింసించడం కళ్లకి కట్టినట్టు చూపించాడు. ప్రజల కష్టాలను చూసిన నరసింహారెడ్డి ఆంగ్లేయులపై పోరాటం చేయడానికి ఏం చేశాడు? ఐకమత్యంలేని సంస్థానాలు ఏకతాటిపైకి పైకి తీసుకొచ్చేందుకు చేసిన ప్రయత్నాలతో ప్రథమార్ధం సాగుతుంది. బ్రిటిష్ అధికారి జాక్సన్ తల నరికి ఆంగ్లేయులకు పంపడంతో ఫస్టాఫ్ ని ముగించాడు.

ఇక సెకాంఢాఫ్ లో కథ, కథనాల్లో వేగం పెంచాడు. చనిపోయిన అధికారి జాక్సన్ స్థానంలో రేనాడు ప్రాంతానికి అత్యంత క్రూరుడైన మరో అధికారిని పంపడంతో ద్వితీయార్ధం ప్రారంభమవుతుంది. అవుకురాజు, వీరారెడ్డి, బసిరెడ్డి పాత్రలు నరసింహారెడ్డికి సహకరిస్తున్నాయా? లేక వెన్నుపోటు పొడుస్తున్నాయా? అన్న ఉత్కంఠను ప్రేక్షకుల్లో కలిగించేలా సన్నివేశాలు ఉంటాయి.యుద్ధ సన్నివేశాలు భీకరంగా ఉన్నాయ్. క్లైమాక్స్ లో ఉయ్యాలవాడని ఉరితీయాలి. కానీ, భావోద్వేగాలు జోడించడంతో సినిమా విషాదాంతంగా ముగించినట్లు అనిపించకుండా దర్శకుడు జాగ్రత్తపడ్డాడు.

నటీటుల ఫర్ ఫామెన్స్ :

చారిత్రాత్మక చిత్రాన్ని కమర్షియల్ గా మలచడంలో దర్శకుడు సురేంధర్ రెడ్డి సక్సెస్ అయ్యారు. చిరు ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని సన్నివేశాలని అల్లుకొన్నారు. భీకరమైన యుద్ధాలని చూపించడమే కాదు.. ఎమోషన్స్ పండించాడు. అందుకే క్లైమాక్స్ అద్భుతంగా అనిపిస్తుంటుంది. ఇక నరసింహారెడ్డి పాత్రలో చిరంజీవి ఒదిగిపోయారు. యువ కథానాయకుడిగా కదనరంగంలోకి దూకారు. నరసింహారెడ్డికి విద్యలు నేర్పి, స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తిని రగిలించే గురువు గోసాయి వెంకన్నగా అమితాబ్ పాత్ర హుందాగా ఉంది.

ఇక అవుకు రాజుగా సుదీప్.. నరసింహారెడ్డి అంటే అసూయ కలిగిన వ్యక్తిగా చక్కగా నటించారు. వీరారెడ్డిగా జగపతిబాబు పాత్ర భిన్న కోణాల్లో సాగుతుంది. బసిరెడ్డిగా రవికిషన్, నరసింహారెడ్డి భార్య సిద్ధమ్మగా నయనతార చక్కగా నటించారు. నరసింహారెడ్డి ప్రియురాలు లక్ష్మిగా చాలా బాగా నటించింది. పాండిరాజాగా విజయ్ సేతుపతి నటన ఆకట్టుకుంటుంది. చివరలో పవన్ కల్యాణ్ వాయిస్ సినిమాకి ప్లస్ అయింది.

సాంకేతికంగా : 

చారిత్రాత్మక చిత్రాలకి సినిమాటోగ్రఫీ ప్రాణం. రత్నవేలు ప్రతి సన్నివేశాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమా ప్రధాన బలం సంగీతం. అమిత్ త్రివేది, జూలియస్ ఫాఖియంలు ఇచ్చిన సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా నేపథ్య సంగీతం అద్భతంగా కుదిరింది. యుద్ధ సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి. హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్స్ గ్రెగ్  పావెల్ నేతృత్వంలో తెరకెక్కిన యాక్షన్ సీన్స్ అదిరిపోయాయ్. రామ్ లక్ష్మణ్ లు తీర్చిదిద్దిన పైట్స్ కూడా బాగున్నాయి. బుర్రా సాయిమాధవ్  డైలాగ్ లు బాగున్నాయి. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి.

చివరగా : సైరా – తెలుగు సినీ చరిత్రలో నిలిచిపోయే సినిమా

రేటింగ్ : 3.5/5

నోట్ : ఇది సమీక్షకుడి వ్యతిగత అభిప్రాయం మాత్రమే.