తెలంగాణ కేబినేట్ కీలక నిర్ణయాలు
సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంగళవారం రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ప్రగతిభవన్‌లో జరిగింది. సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైన సమావేశం దాదాపు ఏడున్నర గంటలపాటు సుదీర్ఘంగా సాగింది. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై కేబినేట్ లో చర్చించారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు పరిశీలించి.. నివేదిక రెడీ చేయడానికి ప్రభుత్వం ఓ కమిటీ వేసింది. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ అధ్యక్షతన ముఖ్య కార్యదర్శులు రామకృష్ణారావు, సునిల్‌శర్మ సభ్యులుగా సీనియర్ ఐఏఎస్ అధికారుల కమిటీని నియమించింది. ఈ కమిటీ ఈరోజు నుంచే పని ప్రారంభించనుంది. త్వరలోనే ప్రభుత్వానికి నివేదికని అందించనుంది.
గ్రామాల్లో 30రోజుల ప్రణాళికపై ఈ నెల10న సీఎం కేసీఆర్ కలెక్టర్లతో సమావేశం కానున్నారు. 8 మంత్రివర్గ ఉపసంఘాలను నియమించాలని క్యాబినెట్ నిర్ణయించింది. వైద్య, ఆరోగ్య కమిటీ, గ్రామీణ పారిశుద్ధ్య కమిటీ, పట్టణ పారిశుద్ధ్య కమిటీ, వనరుల సమీకరణ కమిటీ, పచ్చదనం కమిటీ, వ్యవసాయ కమిటీ, పౌల్ట్రీ కమిటీ, సంక్షేమ కమిటీలని నియమించారు. వీటిని శాశ్వత ప్రాతిపదికన నియమించడం విశేషం.