అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న జగన్
దసరాశరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మను సీఎం వైఎస్ జగన్ ఈరోఝు దర్శించుకోనున్నారు. ప్రభుత్వం తరఫున సీఎం హోదాలో కనకదుర్గ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. శనివారం జగన్ ఢిల్లీ వెళుతున్న నేపథ్యంలో ఈ శుక్రవారమే కనకదుర్గమ్మని దర్శించుకోనున్నారు. ఈ మేరకు జగన్ ఢిల్లీ పర్యటన షెడ్యూల్‌లో మార్పులు చేశారు. జగన్ అమ్మవారిని దర్శించుకునే సమయంలో వీఐపీ క్యూలైన్లను నిలిపివేస్తారు.
దసరా ఉత్సవాలను పురస్కరించుకొని దుర్గగుడి అంతరాలయంలో శుక్రవారం ఉదయం 3గంటలకు సుప్రభాత సేవ, అమ్మవారికి మహాలక్ష్మీదేవి అలంకరణ అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. క్యూలైన్లో వచ్చిన భక్తులకు రాత్రి 11 గంటల వరకు అమ్మవారిని భక్తులు దర్శించుకునేందుకు వీలుంటుంది. మల్లికార్జున మహామండపంలో ఆరో అంతస్తులో ఉదయం 7నుంచి 9గంటల వరకు, ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రత్యేక కుంకుమార్చన నిర్వహిస్తారు. టిక్కెట్టు రుసుము రూ.3వేలుగా నిర్ణయించారు. యాగశాలలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శత చండీయాగం నిర్వహిస్తారు.