ప్రధాని మోడీని కేసీఆర్ ఏం కోరారంటే ? 


ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్‌.. ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. సుమారు 50నిమిషాల పాటు ప్రధానితో సమావేశమై చర్చలు జరిపారు. మొత్తం 22 అంశాలని సీఎం కేసీఆర్ ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ప్రధాని ఓ లేఖని అందజేశారు. ప్రధానిగా మోదీ రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనతో కేసీఆర్‌ భేటీ కావడం ఇదే తొలిసారి. 

తెలుగు రాష్ట్రాల మధ్య గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం ప్రాజెక్టు సంబంధించిన అంశంపై ప్రధానితో కేసీఆర్‌ చర్చించినట్లు సమాచారం. దీనికి కేంద్రం సహకారం అందించాలని కోరినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని ఏదైనా ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదాతో పాటు మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ పథకాలకు నిధుల కేటాయింపు, పెండింగ్‌లో ఉన్న విభజన హామీల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని మోదీని కేసీఆర్‌ కోరినట్లు సమాచారమ్. అంతకుముందు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో కేసీఆర్‌ భేటీ అయ్యారు. రాజీవ్ రహదారి విస్తరణకు కంటోన్మెంట్ భూములను అప్పగించాలని కేసీఆర్ రాజ్‌నాథ్‌ను కోరారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా మరికొందరు కేంద్రమంత్రులతోనూ ఆయన సమావేశం కానున్నారు.