క్రీడల్లో రావడాన్ని గర్వంగా భావిస్తున్నా : సానియా


క్రీడల్లో రావడాన్ని గర్వంగా భావిస్తున్నానన్నారు టెన్నిస్ స్టార్ సానియా మీర్జా. గురువారం ఢిల్లీలో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదికలో ఆమె ప్రసంగించారు. ‘మా తల్లిదండ్రులతో పాటు చుట్టాలందరూ చిన్నప్పుడు టెన్నిస్ ఆడితే ఎంత నల్లగా అవుతావో తెలుసా… అలా యితే ఎవరు నిన్ను పెళ్లి చేసుకుంటారు  అనే వాళ్లు. అప్పుడు నా వయసు కేవలం ఎనిమిదేళ్లు మాత్రమే. ఒంటి రంగు మారడం వల్ల పెళ్లి కాదని వాళ్లు అప్పుడే ఆలోచించేవాళ్లు. ఒక అమ్మాయి తెల్లగా ఉంటేనే బాగుంటుంది అనుకునే సంస్కృతి మన దగ్గర ఉంది. ఇది మారాలి. నేను క్రీడల్లో రావడాన్ని గర్వంగా భావిస్తున్నా’నన్నారు

సింధు, సైనా నెహ్వాల్, దీపా కర్మాకర్  లాంటి ఎంతోమంది తారలు అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇప్పటికీ పురుషులతో సమానంగా మాకు అవకాశాలు రావట్లేదు. వస్తే ఇంకెంత ఎత్తుకు ఎదుగుతామో ఆలోచించండి అన్నారు సానియా. దాంతో పాటు క్రికెటర్లు విదేశీ పర్యటనకు వెళ్లినప్పుడు భార్యలు, ప్రియురాళ్లను తీసుకు వెళ్లకూడదనే నిబంధనను సానియా తప్పుబట్టింది.  క్రికెటర్లు విదేశీ పర్యటనల సమయంలో భార్యలను, ప్రియురాళ్లను తీసుకెళ్తే వాళ్ల ఏకాగ్రత దెబ్బతింటుందని అంటున్నారు. ఇందులో ఏమైనా అర్ధం ఉందా? పురుషుల ఏకాగ్రత దెబ్బ తినడానికి అమ్మాయిలే కారణమా. వాళ్లు వస్తే తప్పేంటి ? అని ప్రశ్నించారు. కోహ్లి త్వరగా ఔట్  అయితే అనుష్కశర్మను నిందిస్తున్నారు.. ఏమైనా భావ్యమా అన్నారు.