ఆర్టీసీ సమ్మెపై పవన్ కామెంట్స్


తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మెకి దిగిన సంగతి తెలిసిందే. ప్రభుత్వంతో కార్మికులు పలుమార్లు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. మరోవైపు, ప్రభుత్వం పట్టుదలతో ఉంది. కార్మికుల గొంత్తెమ్మ కోరికలని తీర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. మరోసారి కార్మికులతో చర్చలు జరిపే ప్రసక్తే లేదు. శనివారం సాయంత్రానికల్లా విధుల్లో చేరని ఆర్టీసీ కార్మికుల ఉద్యోగాలని తొలగిస్తాం. వారి స్థానంలో కొత్తవారిని తీసుకొంటాం. 15రోజుల్లోనే పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేలా చర్యలు చేపట్టబోతున్నామని స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయినా.. ఆర్టీసీ కార్మికులు ఏమాత్రం తగ్గడం లేదు.

సోమవారం కార్మికులు విధులకి దూరంగా ఉన్నారు. సమ్మెని మరింత ఉదృతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వారికి ప్రతిపక్షాల మద్దతు లభించింది. కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, టీజె ఎస్ తదితర పార్టీలు ఆర్టీసీ కార్మికుల సమ్మెకి మద్దతు తెలుపుతున్నట్టు ప్రకటించాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమ్మెపై స్పందించారు.  డిమాండ్ల సాధనకు ఉద్యోగులు చేసే ఆందోళనలను సానుభూతితో పరిశీలించాలే తప్ప కఠినమైన నిర్ణయాలు తీసుకోవద్దని ప్రభుత్వానికి ఆయన సూచించారు.

సకల జనుల సమ్మెలో భాగంగా 17 రోజుల పాటు ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేసి ఉద్యమానికి అండగా ఉన్నారని పవన్‌ గుర్తుచేశారు.
కార్మికులు చేసిన త్యాగాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలని చెప్పారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని కోరుతున్నానని పవన్ అన్నారు. ప్రజలకు కష్టం కలగకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు.