కస్టమర్లకు జియో షాక్


టెలికాం సంచలనం జియో కస్టమర్లకి షాక్ ఇచ్చింది. ఇక నుంచి ఇతర నెట్‌వర్క్స్‌కి ఉచితంగా కాల్స్ చేసే అవకాశం ఉండదని ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు ఉచితంగా అన్ని ఆపరేటర్లకు కాల్స్ చేసుకున్న కస్టమర్లు.. ఇక నుంచి జియో కాకుండా ఇతర నెట్‌వర్క్స్‌కి కాల్స్ చేస్తే ఛార్జ్‌లు చెల్లించాల్సి ఉంటుంది. ఐయూసీ కింద ఇతర మొబైల్ ఆపరేటర్లకు కాల్స్ చేసినప్పుడు నిమిషానికి 6 పైసలు చొప్పున చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. ఐతే, ఇతర ఆపరేటర్లకు చేసిన కాల్స్‌కు చెల్లించిన రుసుముకు బదులుగా.. డేటాను తిరిగి ఇవ్వనున్నట్లు తెలిపింది. ఛార్జీల విషయంలో ట్రాయ్‌ ఇచ్చిన నిబంధనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

కాల్స్‌కు వసూలు చేసిన మొత్తాన్ని డేటా రూపంలో తిరిగి వినియోగదారులకు అందివ్వనున్నారు. ఇందుకోసం కొన్ని టాపప్‌ వోచర్లను కూడా ప్రకటించింది. రూ. 10 నుంచి రూ. 100 రూపాయల వరకు వోచర్స్ అందుబాటులో ఉన్నాయి. ట్రాయ్ ఐయూసీ ఛార్జీలు పూర్తిగా ఆపేసిన రోజున ఈ ఛార్జీలను వసూలు చేయబోమని తేల్చిచెప్పింది. ట్రాయ్ ఐయూసీ ఛార్జ్‌లను 1జనవరి, 2020 నుంచి ఎత్తివేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.