ఆర్టీసీ సమ్మె : సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం
ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకొన్నారు. శనివారం సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, రవాణాశాఖ, ఆర్టీసీ అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు. సమ్మె చేస్తున్న వారితో ఇకపై ప్రభుత్వం ఎలాంటి చర్చలు జరపబోదని మరోసారి స్పష్టం చేశారు.సమ్మెకు దూరంగా ఉన్నవారికే సెప్టెంబర్ నెల జీతాలు ఇవ్వనున్నట్లు చెప్పారు.
మరో మూడు రోజుల్లో ఆర్టీసీ బస్సులు పూర్తి స్థాయిలో రోడ్లపై తిరగాలని,ఈ మేరకు చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ అధికారులని ఆదేశించారు. యూనియన్ నేతల నిర్ణయాలను నమ్మి 48వేల మంది కార్మికులు తమ ఉద్యోగాలను పోగొట్టుకున్నారని సీఎం మండిపడ్డారు. సమ్మెను ఎట్టిపరిస్థితుల్లో తాము గుర్తించేది లేదని తేల్చి చెప్పారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావద్దనే ఉద్దేశంతోనే పాఠశాలలకు దసరా సెలవులని ఈనెల 19వరకు పొడిగించినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు.
మరోవైపు, ఆర్టీసీ కార్మికులు సమ్మెని మరింత ఉదృతం చేసే దిశగా కార్యచరణ ప్రకటించారు. ఈనెల 13న రాష్ట్ర వ్యాప్తంగా వంటావార్పు, 14న అన్ని డిపోల ఎదుట బైఠాయింపు, బహిరంగసభలు, 15న రాస్తారోకోలు, మానవహారాలు, 16న ఐకాసకు మద్దతుగా విద్యార్థుల ర్యాలీలు, 17న ధూంధాం కార్యక్రమాలు, 18న ద్విచక్రవాహన ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇక ఈ నెల 19న తెలంగాణ బంద్ ని పాటించాలని పిలుపునిచ్చారు.