బీసీసీఐలో దాదాగిరి.. పది నెలలు మాత్రమే !


టీమిండియా మాజీ కెప్టెన్ గంగూలీ అనూహ్యంగా బీసీసీ అధ్యక్షుడైన సంగతి తెలిసిందే. బ్రిజేష్ పటేల్ అధ్యక్షుడు అవుతాడని వార్తలు బయటికి వచ్చిన కొన్ని గంటల్లోనే పరిస్థితులు వేగంగా మారిపోయాయి. నాటకీయ రీతిలో గంగూలీ అందరికీ ఆమోదయోగ్యుడైన అభ్యర్థి అయ్యాడు. గంగూలీ ఎన్నిక ఏకగ్రీవం అయిపోయింది. ఐతే, ఒకప్పుడు టీమ్ ఇండియా కెప్టెన్సీ లాగే ఇప్పుడు బీసీసీఐ అధ్యక్ష పదవి కూడా గంగూలీకి ముళ్ల కిరీటమే. చక్కదిద్దాల్సిన పనులు బోర్డులో చాలానే ఉన్నాయి. ఐతే, ఈ పదవిలో గంగూలీ కేవలం పది నెలలు మాత్రమే ఉండనున్నారు.

ఇందుకు కారణం.. లోధా కమిటీ తెచ్చిన తప్పనిసరి విరామం నిబంధనే. దీని ప్రకారం బీసీసీఐ, రాష్ట్ర క్రికెట్ సంఘాల్లో ఆరేళ్ల పాటు పదవిలో ఉన్న ఎవరైనా మూడేళ్ల విరామం తీసుకోవాలి. క్రికెట్ పాలన వ్యవహారాలకు దూరంగా ఉండాలి. గంగూలీ అయిదేళ్లకు పైగా బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. బీసీసీఐ అధ్యక్షుడిగా పది నెలల పదవీ కాలం పూర్తి కాగానే.. అతను అతను ఆరేళ్ల పరిమితిని దాటేస్తాడు. దీంతో గంగూలీ పదవి నుంచి దిగిపోవాల్సి ఉంటుంది. మూడేళ్లు విరామం తీసుకుని మళ్లీ అధ్యక్ష పదవికి పోటీ పడొచ్చు. మరి ఇంత తక్కువ వ్యవధిలో గంగూలీ అధ్యక్షుడిగా ఎలాంటి ముద్ర వేస్తాడో చూడాలి