అయోధ్య కేసు విచారణలో హై డ్రామా


అయోధ్య భూ వివాదం కేసులో సుప్రీం కోర్టులో మరికొద్దిసేపట్లో వాదనలు ముగియనున్నాయి. సాయంత్రం 5గంటలకి వరకు విచారణ జరగనుంది. ఆ తర్వాత తుది తీర్పు రావడమే తరువాయి. నవంబర్ 17లోపు అంటే.. సుప్రీం చీఫ్ జస్టీస్ జస్టిస్ రంజన్ గొగొయ్ పదవి విరమణ చేసే లోపు..  ఏ క్షణమైన తీర్పు రావొచ్చు. 

ఐతే, బుధవారం అయోధ్య కేసు విచారణలో హై డ్రామా చోటు చేసుకుంది. విచారణలో భాగంగా హిందూ మహాసభ తరఫు సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ ఓ పుస్తకాన్ని కోర్టు ముందుంచారు. మాజీ ఐపీఎస్ కిశోర్ అయోధ్య రీవిజిటెడ్ పేరుతో రాసిన ఆ పుస్తకాన్ని సమర్పించే సమయంలో సున్నీ వక్ఫ్ బోర్డ్ తరఫు న్యాయవాది రాజీవ్ ధావన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ పుస్తకాన్ని సమర్పిస్తే చించేస్తానని హెచ్చరించారు. అయినప్పటికీ..వికాస్ తన వాదన వినిపిస్తుండగా.. మధ్యలో రాజీవ్ ధావన్ జోక్యం చేసుకుని ఆ పుస్తకాన్ని, మ్యాప్ ను చించివేశారు. 

దీనిపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 1986లో ముద్రించిన పుస్తకం ఇది. ఆ పుస్తకాన్ని రికార్డుల్లోకి తీసుకోవద్దంటూ ధావన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి కొత్త రికార్డులు కావాలని పట్టుబట్టారు. దీన్నంతా గమనించిన జస్టిస్ రంజన్  గొగొయ్ ఇరువర్గాల న్యాయవాదులపై అసహనం వ్యక్తం చేశారు. సాయంత్రం 5గంటల వరకు విచారణ కొనసాగనుంది.