సమ్మెపై సీఎం కొత్త మాట


మాట మార్చడం, మడమ తిప్పకపోవడం అంటే ఇదేనేమో..! ఆర్టీసీ కార్మికుల సమ్మెపై సీఎం కేసీఆర్ మాట మార్చలేదు. ఆయన పాత మాటనే కొత్తగా చెప్పారు. ఎట్టిపరిస్థితుల్లో కార్మికులతో చర్చలు జరిపే ప్రసక్తి లేదని మరోసారి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె, హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ముఖ్య కార్యదర్శి సునిల్  శర్మ, ఆర్టీసీ ఉన్నతాధికారులు హాజరయ్యారు. దాదాపు 5 గంటల పాటు సమావేశం జరిగింది.
 
కార్మిక సంఘాలు అనాలోచితంగా సమ్మెకు వెళ్లాయని, ఎట్టి పరిస్థితుల్లో వాటితో చర్చల ప్రసక్తే లేదని సీఎం స్పష్టం చేశారు. ఆర్టీసీ సమ్మె అసంబద్ధమని న్యాయస్థానంలో బలమైన వాదన వినిపించాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త ఎండీ నియామకం సాధ్యంకాదని, తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటామని న్యాయస్థానానికి వివరించాలని సీఎం సూచించారు. వెంటనే ఆర్టీసీలో కొత్త సిబ్బంది నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేయాలని, మరిన్ని బస్సులు అద్దెకు తీసుకోవాలని ఆదేశించారు. మరోవైపు ఆర్టీసీ కార్మికుల సంఘాలు ఏమాత్రం తగ్గడం లేదు. సమ్మెని మరింత ఉదృతం చేసే దిశగా ప్రణాఌకలు రచిస్తున్నాయ్. మరీ.. సమ్మెకు ఎప్పుడు, ఏ రకంగా పులిస్టాప్ పడుతుందన్నది చూడాలి.