చిరు152పై తప్పుడు ప్రచారం


మెగాస్టార్ చిరంజీవి 151 చిత్రం ‘సైరా’ ఆయన కెరీర్ లో ఓ మైలురాయిగా నిలిచింది. ‘సైరా’ సక్సెస్ జోష్ లో ఉన్న చిరు ఇటీవలే తన 152 చిత్రాన్ని ప్రారంభించారు. కొరటాల శివ దర్శకత్వంలో చిరు 152 తెరకెక్కనుంది. ఇప్పుడీ సినిమాకు టైటిల్ ఫిక్సయింది. ‘గోవింద ఆచార్య’ టైటిల్ ఫిక్స్ చేశారు… అంటూ ఏకంగా టైటిల్ పోస్టర్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఐతే, ఇది ఫ్యాన్ మేడ్ టైటిల్ పోస్టర్. అంతేకాదు.. చిరు 152 సినిమా కోసం హీరోయిన్ గా త్రిషని తీసుకొన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఐతే, ఈ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదట.

ఈ మేరకు నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపింది. “చిరు 152వ చిత్రం టైటిల్ ను ఇంకా ఖరారు చేయలేదు. ఈ ప్రాజెక్టు సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తయిన తర్వాత మేమే అధికారికంగా ప్రకటిస్తాం” అని ట్విట్ చేశారు.  చిరు తనయుడు రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కొరటాల శివ కథలన్నీ సామాజిక నేపథ్యం చుట్టూ తిరుగుతాయి. ఓ బలమైన అంశానికి కమర్షియల్  ఎలిమెంట్స్ జోడించి తెరపై చూపిస్తారు.చిరు 152 లో కూడా అలాంటి అంశాన్నే ఎంచుకున్నారని తెలుస్తోంది. దేవాలయాలు, వాటి సమస్యల చుట్టూ కథ నడుస్తుందని సమాచారం.