ఆర్టీసీ ఆస్తులపై కన్నేసిన కేసీఆర్


ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో సీఎం కేసీఆర్ పై ప్రతిపక్ష నేతలు మూకుమ్మడి దాడికి దిగుతున్నారు.మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఎప్పటిలాగే సీఎం కేసీఆర్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆర్టీసీ ఆస్తులపై సీఎం కేసీఆర్ కన్నేశారని ఆరోపించారు. శుక్రవారం యాదాద్రిలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్.. రూ. 85 వేల కోట్ల ఆర్టీసీ ఆస్తులపై కేసీఆర్‌ కన్నేశారన్నారు. ప్రభుత్వంతో కొట్లాడి ఆర్టీసీ కార్మికులు హక్కుల సాధించుకోవాలన్నారు. కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడొద్దని సూచించారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. ఆయన హైదరాబాద్ లోని బీహెచ్ఈఎల్ నుంచి కూకట్ పల్లి వరకు బీజేపీ నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈసందర్భంగా మాట్లాడిన లక్ష్మణ్.. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల్లోకి తెస్తామని కేసీఆర్ చెప్పలేదా ? అని ప్రశ్నించారు. కేసీఆర్ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు. కార్మికులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దన్నారు. 

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ కళ్లు తెరిపించాల్సి ఉంది. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటే పట్టించుకోవడం లేదు. గవర్నర్ చొరవ తీసుకొని సమస్యను పరిష్కరించాలి. ఆర్టీసీ అప్పులు అనేది ఉత్తిమాట. ఆకాంక్షల అమలు కోసం ఉద్యమం చేయాల్సిన అవసరముందన్నారు.