ఈఎస్ఐ స్కాం నిందితురాలు ఆత్మహత్యాయత్నం


ఈఎస్‌ఐ సంయుక్త సంచాలకురాలు పద్మ చంచల్‌గూడ జైల్లో విచారణ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆమె శనివారం ఆత్మహత్యకు యత్నించారు. తన వద్ద ఉన్న మాత్రలను ఎక్కువగా వేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తోటి ఖైదీల ద్వారా విషయం తెలుసుకున్న జైలు అధికారులు ఆమెకు వెంటనే ప్రథమ చికిత్స అందించారు. అనంతరం ఆమెని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేదని జైలు అధికారులు తెలిపారు.

ఈఎస్‌ఐ బీమా వైద్య సేవల కుంభకోణంలో పద్మ నిందితురాలిగా ఉన్నారు. గతనెల 27న పద్మను అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు న్యాయస్థానం ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. అప్పటి నుంచి ఆమె చంచల్‌గూడ జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. ఈఎస్‌ఐ ఔషదాల కుంభకోణంలో ఏసీబీ అధికారులు ఇప్పటి వరకు 16 మందిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.