ఆర్టీసీ కార్మికుల సెల్ఫ్ గోల్
టీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ విషయంలో కార్మికులు సెల్ఫ్ గోల్ చేసుకొన్నారు. ఆర్టీసీ సమ్మెకు దిగిన సందర్భంలోనూ, ప్రభుత్వంతో చర్చలు జరిపిన సందర్భంలోనూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ ప్రధానంగా వినబడింది. ఐతే, హైకోర్టులో వాదనల సమయంలో ఆ డిమాండ్ ని ఆర్టీసీ కార్మికులు లైట్ తీసుకొన్నట్టు అర్థమైంది.
హైకోర్టులో విచారణ సందర్భంగా మాత్రం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం మీదనే పట్టుపట్టబోమని చెప్పారు. కార్మిక సంఘాల తరఫున కోర్టులో వాదించిన న్యాయవాది ప్రకాశ్‌రెడ్డి కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయమనే డిమాండ్ నెరవేరితే చర్చలకు రాబోమని కార్మికులు ఎప్పుడూ చెప్పలేదన్నారు. విలీన డిమాండ్ ఒక్కటే ప్రధానం కాదని వారి న్యాయవాది చెప్పారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జారీ చేసిన ఉత్తర్వుల్లో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. దీంతో కార్మికులు విలీనం డిమాండ్ వదులుకున్నట్లయింది.
ఈ నేపథ్యంలో కార్మికులు లేవనెత్తిన డిమాండ్లలో 21 అంశాలను పరిశీలించాలని కేసీఆర్ ప్రభుత్వం ఆర్టీసీ ఈడీలతో ఆర్టీసీ ఎండీ కమిటీని నియమించారు. మంగళవారం ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్ష జరిపారు. ఈ భేటీలోనే ఆర్టీసీ కార్మికుల డిమాండ్ లపై కమిటీ వేయాల్సిందిగా సీఎం సూచించారు. సీఎం ఆదేశాలత్రోఆర్టీసీ ఇన్‌ఛార్జి ఎండీగా వ్యవహరిస్తున్న రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ ఆరుగురు అధికారులతో కమిటీ వేశారు. ఈడీ టి.వెంకటేశ్వరరావు అధ్యక్షుడిగా ఈడీలు ఎ.పురుషోత్తం, సి.వినోద్ కుమార్, ఇ.యాదగిరి, వి.వెంకటేశ్వర్లు, ఆర్థిక సలహాదారు ఎన్.రమేష్‌లు సభ్యులుగా కమిటీ ఏర్పడింది. హైకోర్టు సూచించిన 21 అంశాలను పరిశీలించి, ఒకటి రెండు రోజుల్లో కమిటీ తన నివేదికను ఆర్టీసీ ఎండీకి అందించనుంది.