మున్సిపల్ ఎన్నికలకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. మున్సిపల్ ఎన్నికలపై దాఖలైన అన్ని పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. రిజర్వేషన్లు, వార్డుల విభజనపై హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. కొన్ని నెలలుగా పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. తాజాగా తీర్పు వెలువరించింది.  ఎన్నికల ఏర్పాట్లు చట్టబద్ధంగా జరగడం లేదని దాఖలైన వ్యాజ్యాలను ధర్మాసనం కొట్టివేసింది. దీంతో తెలంగాణలో మళ్లీ ఎన్నికల నగారా మ్రోగనుంది.

రాష్ట్రంలో మొత్తం 128 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్లు ఉన్నాయి. అయితే గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్, గ్రేటర్ ఖమ్మం కార్పొరేషన్ల పదవీ కాలం ఇంకా పూర్తి కాలేదు. దీంతో 10 నగరపాలికలకు మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు 128 మున్సిపాలిటీల్లో సిద్దిపేట, అచ్చంపేట పురపాలికల పదవీ కాలం పూర్తి కాలేదు. అంతేకాకుండా కొన్ని సమస్యల వల్ల మరో ఐదు పురపాలక స్థానాల్లో ఎన్నికలు నిర్వహించడం సాధ్యపడలేదు. దీంతో రాష్ట్రంలో 121 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి.