హాజీపూర్ హత్యకేసులో కీలక మలుపు

పోలీసులు మాట ఇచ్చినట్టుగానే హాజీపూర్ వరుస హత్యకేసులో దర్యాప్తుని చాలా వేగంగా పూర్తి చేశారు. కేసుకు సంబంధించి టెక్నికల్స్ ఆధారాలతోపాటు డీఎన్ఏ, ఫోరెన్సిక్ ఆధారాలను సైతం పోలీసులు సంపాదించారు. భువనగిరి స్పెషల్ కోర్టు ఈనెల 14 నుంచి 18 వరకు ట్రయిల్ రన్ మొదలుపెట్టగా ఛార్జ్ షీట్లు, ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టులు కోర్టుకు అందజేశారు. మరో 45 రోజులపాటు హాజీపూర్ వరుస హత్యల ఘటనపై భువనగిరి స్పెషల్ కోర్టులో విచారణ జరగనుంది.

నిందితుడు శ్రీనివాస్ రెడ్డి సెల్ ఫోన్‌లో ఉన్న మెసేజ్‌లు, వీడియోలను కూడా పోలీసులు సేకరించారు. కోర్టులో నేరం నిరూపణ కావడానికి కావలసిన బలమైన సాక్ష్యాధారాలు అన్నిటినీ న్యాయస్థానానికి అందజేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే నిందితుడు శ్రీనివాస్ రెడ్డికి మరణ శిక్ష పడేలా అన్ని సెక్షన్లు నమోదు చేశారు. 45రోజుల విచారణ అనంతరం భువనగిరి కోర్టు తుది తీర్పు ఇవ్వనుంది. కచ్చితంగా నిందితుడు శ్రీనివాస్ రెడ్డి ఉరిశిక్ష పడుతుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

బొమ్మలరామారం మండలం హాజీపూర్ కు చెందిన శ్రీనివాస్ రెడ్డి ఏసీ మెకానిక్ గా పనిచేసేవాడు. ఆ గ్రామానికి బస్సు సౌకర్యం లేకపోవడంతో బైక్ పై లిఫ్ట్ ఇస్తూ అమాయకులైన యువతులపై అత్యాచారం చేసి అతికిరాతకంగా హత్య చేసేవాడు. 2015 ఏప్రిల్ నెలలో మెుదటి హత్య చేశాడు శ్రీనివాస్ రెడ్డి. ఆ తర్వాత 2019 మార్చి, ఏప్రిల్ నెలలో మరో ఇద్దరు మైనర్ బాలికలను అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేశాడు.  శ్రావణి అనే పదో తరగతి బాలిక మిస్సింగ్ కేసులో శ్రీనివాస్ రెడ్డి దారుణాలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.