జగన్ ని కలిసిన వంశీ.. పార్టీ మార్పు ఖాయమా ?
తెదేపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీ మారబోతున్నారనే ప్రచారం గత కొద్దిరోజులుగా జోరుగా సాగుతోంది. దానికి తగ్గట్టుగానే వంశీ అడుగులు పడుతున్నట్టు కనిపిస్తోంది. ఆయన బీజేపీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరితో టచ్ లో ఉంటున్నారు. సుజనా ఎప్పుడు విజయవాడ వచ్చినా.. వెళ్లి కలిసి చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో వంశీ భాజాపాలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారనే ప్రచారం జరిగింది. ఇంతలో వంశీ ట్విస్ట్ ఇచ్చారు. శుక్రవారం మంత్రులు కొడాలి నాని, షేర్నినానిలతో కలిసి సీఎం జగన్ తో భేటీ అయ్యారు. అరగంట పాటు చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో వంశీ త్వరలోనే వైకాపా తీర్థం పుచ్చుకోబోతున్నారనే టాక్ మొదలైంది.
సీఎం జగన్ ని కలవడం కంటే ముందు వంశీ బీజేపీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరిని కలిశారు. ఇవాళ ఉదయం గుంటూరులో సుజనాచౌదరి పర్యటన సమయంలో ఆయనతో సమావేశమయ్యారు. తర్వాత ఒకే కారులో ఇద్దరూ కలిసి గుంటూరు నుంచి ఒంగోలు వెళ్లినట్టు సమాచారం. ఆ వెంటనే వచ్చి వంశీ సీఎం జగన్ తో సమావేశం అవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఐతే, పార్టీ మారే విషయంలోనే వంశీ ముఖ్యమంత్రిని కలిశారా? లేక గన్నవరం నియోజకవర్గంలోని రాజకీయ పరిణామాలు, ఇటీవల వంశీపై నకిలీ పట్టాల వ్యవహారంపై కేసు నమోదు చేయడం గురించి చర్చించేందుకు కలిశారా? అన్నది తెలియాల్సి ఉంది. ఈ విషయంలో దీపావళీ తర్వాత క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.