వంశీ రెండు పడవల ప్రయాణం

రెండు పడవల ప్రయాణం ప్రమాదకరం అంటుంటారు. ఇప్పుడు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రెండు పడవల ప్రయాణం చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఆయన పార్టీ మారడం ఖాయం. తెదేపాని వీడి భాజాపా లేదా వైకాపాలో చేరబోతున్నట్టు వార్తలొచ్చాయ్. అవి నిజమే అన్నట్టు వంశీ ముందుగా బీజేపీ ఎంపీ సుజనా, ఆ తర్వాత సీఎం జగన్ ని కలిశారు. జగన్ ని కలిసిన తర్వాత వంశీ వైకాపాలో చేరడం ఖాయమని అందరు ఫిక్సయ్యారు. దానికి తదుపరి అడుగు అన్నట్టుగా వంశీ ఆదివారం తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. తెదేపా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు లేఖ పేర్కొన్నారు.

స్థానిక వైకాపా నాయకులు, కొంత మంది ప్రభుత్వం అధికారుల వల్ల తన అనుచరులు, మద్దతుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారని లేఖలో పేర్కొన్నారు. వారి ఇబ్బందుల్ని తొలగించడానికే రాజకీయాల నుంచి వైదొలుగుతున్నానని తెలిపారు. వంశీ లేఖకు చంద్రబాబు రిప్లై ఇచ్చారు. రాజ్యాంగ వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని.. ఈ క్రమంలో వ్యక్తిగతంగా, పార్టీ పరంగా ఎప్పటికీ అండగా ఉంటామని వంశీకి హామీ ఇచ్చారు. తన లేఖపై స్పందించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ తాజాగా వంశీ మరో లేఖ రాశారు. 

ఇదంతా బాగానే ఉన్నా. వైకాపాలో చేరాలనుకొంటున్న వంశీ.. రాజకీయాల నుంచి తప్పుకొంటున్నట్టు ఎందుకు పేర్కొన్నారు. అలాంటప్పుడు సీఎం జగన్ ని ఎందుకు కలవాల్సి వచ్చింది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయ్. మొత్తానికి.. వైకాపా నుంచి వంశీ పూర్తి స్థాయిలో ఆహ్వానం అందలేదని తెలుస్తోంది. గన్నవరం స్థానిక వైకాపా నేత వంశీ రాకని గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. ఇదీగాక.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పార్టీలోకి రావాలని సీఎం జగన్ సూచన వంశీకి ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో వంశీ ఇటు తెదేపా అటు వైకాపాలని దూరం చేసుకోకుండా రెండు పడవల ప్రయాణం చేస్తున్నట్టు.. కన్ఫూజన్ లో ఉన్నట్టు కనబడుతోంది.