భారతీయ వాట్సాప్ అకౌంట్స్ హ్యాక్
మే నెలలో ఫేస్ బుక్ గుర్తించిన సైబర్ దాడి నిజమేనని తెలుస్తోంది. కొన్ని ఫోన్లపై సైబర్ దాడి జరిగినట్లు మే నెలలో ఫేస్‌బుక్ సంస్థ గుర్తించింది. ఆ తర్వాత ఆ దాడులను బ్లాక్ చేశారు. భారతీయ జర్నలిస్టులు, మానవ హక్కుల నేతలకు సంబంధించిన వాట్సాప్ అకౌంట్లను ఇజ్రాయిల్ స్పైవేర్ నిఘా సంస్థ హ్యాక్ చేసినట్లు తెలుస్తోంది. ఫేస్‌బుక్‌కు చెందిన వాట్సాప్ ఈ విషయాన్ని ద్రువీకరించింది. సుమారు 1400 మంది యూజర్ల ఫోన్లను వాట్సాప్ ద్వారా హ్యాక్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
నాలుగు ఖండాలకు చెందిన ఉన్నతాధికారులు, రాజకీయవేత్తలు, జర్నలిస్టులను హ్యాక్ చేశారు. ఫోన్‌ను హ్యాక్ చేసిన స్పైవేర్ .. యూజర్ల మెసేజ్‌లను, కాల్స్, పాస్‌వర్డ్‌లను చోరీ చేసింది. ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై అటాక్ చేసిన తర్వాత దాంట్లో ఉన్న డేటాను దొంగలించాయి. వీడియో కాల్ చేస్తున్న సమయంలో పెగాసస్ అనే స్పైర్‌వేర్ ఫోన్‌లోకి ప్రవేశిస్తుంది. ఒకవేళ ఫోన్ మాట్లాడకున్నా.. వైరస్ మాత్రం ఫోన్లో ఇన్‌స్టాల్ అవుతుంది. వైరస్ కోడ్‌తో ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను హ్యాక్ చేసి.. యూజర్ డేటాను యాక్సెస్ చేస్తారు. ఐతే, ఈ ఆరోపణలని ఇజ్రాయిల్‌కు చెందిన స్పైవేర్ పెగాసస్ ఖండిస్తోంది.