కేటీఆర్’పై కోమట్ రెడ్డి ప్రశంసల జల్లు.. ఏంటీ మేటర్ ?

మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమట్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి కేటీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించడం హాట్ టాపిక్ గా మారింది. యాదాద్రి భువనగిరి జిల్లా దండు మల్కాపూర్‌లో గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్కును శుక్రవారం మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే కోమట్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి.. కేటీఆర్ ని ప్రశంసలతో ముంచెత్తారు. 

“ఇండస్ట్రీయల్ పార్కు కోసం రైతులు తక్కువ ధరకు భూములిచ్చి పెద్ద మనసు చాటుకున్నారు. భూసేకరణ విషయంలో తోడ్పాడునందించిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. మంత్రి కేటీఆర్‌ లాంటి అనుభవం, అవగాహన ఉన్న వ్యక్తి పరిశ్రమల శాఖ మంత్రి కావడం మన అదృష్టం. మునుగోడు ప్రజల తరపున మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నా. అంతర్జాతీయ ప్రమాణాలు, అత్యాధునిక మౌలిక వసతులతో గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌లో పరిశ్రమలు పెట్టేందుకు వస్తున్న వారికి ధన్యవాదాలు” అన్నారు రాజగోపాల్.

ఇక కొన్నాళ్లుగా రాజగోపాల్ రెడ్డి పార్టీ మారేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. హుజూర్ నగర్ ఉప ఎన్నిక ముందు ఆయన బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు చేశారు. ఈ మేరకు నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. కొందరు కార్యకర్తలు రాజగోపాల్ రెడ్డి నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఇదీగాక, బీజీపీ హైకమాండ్ నుంచి రాజగోపాల్ కి పూర్తి స్థాయిలో గ్రీన్ సిగ్నల్ రానట్టు తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన వెయిటింగ్ లిస్టులో ఉన్నారు. ఇలాంటి సమయంలో రాజగోపాల్ రెడ్డి.. మంత్రి కేటీఆర్ కేటీఆర్ పై ప్రశంసలు గుప్పించడం హాట్ టాపిక్ గా మారింది. ఆయన బీజేపీలో చేరడంపై మనసు మార్చుకొన్నారా ? కారెక్కేందుకు నిర్ణయించుకొన్నాడా ?? అనే చర్చ మొదలైంది. దీనిపై కోమట్ బ్రదర్ క్లారిటీ ఇచ్చేదాక వెయిట్ చేయాల్సిందే.