రివ్యూ : మీకు మాత్రమే చెప్తా 

చిత్రం : మీకు మాత్రమే చెప్తా  (2019)

నటీనటులు : తరుణ్ భాస్కర్, వాణీ భోజనం, అభినవ్ గోమాటం, అనసూయ తదితరులు

సంగీతం : శివకుమార్

దర్శకత్వం : షమీర్ సుల్తాన్

నిర్మాత : విజయ్ దేవరకొండ (కింగ్ ఆఫ్ హిల్స్)

రిలీజ్ డేట్ : 01నవంబర్, 2019.

రిస్క్ తీసుకోవడం రౌడీ హీరో విజయ్ దేవకొండకు అలవాటే. ‘పెళ్లి చూపులు’ లాంటి క్లాస్ సినిమా తర్వాత ‘అర్జున్ రెడ్డి’ ప్రేక్షకులకి  షాక్ ఇచ్చారు. ఇక అర్జున్ రెడ్డి లాంటి సినిమా తర్వాత ‘గీతా గోవిందం’తో మరోసారి షాక్ ఇచ్చారు. ఇప్పుడు నిర్మాతగా అంతే. ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమా కోసం ఇన్నాళ్లు సంపాదించిన దాంట్లో 70శాతం ఖర్చు చేశారు. పెళ్లి చూపులు తర్వాత విజయ్ దేవరకొండ నచ్చిన కథ ఇది. ‘అర్జున్ రెడ్డి’ బ్లాక్ బస్టర్ హిట్ నేపథ్యంలో ఈ సినిమా చేయలేకపోయాడు. కానీ, ఆ సినిమాపై నమ్మకం మాత్రం పోలేదు. తనే నిర్మాతగా మారి.. తనకి హీరోగా లైఫ్ ఇచ్చిన దర్శకుడు తరుణ్ భాస్కర్ ని హీరో చేసి ‘మీకు మాత్రమే చెప్తా’ తీశాడు.

ఈ చిత్రానికి షమీర్ సుల్తాన్ దర్శకుడు. ఇందులో తరుణ్ భాస్కర్ కి జంటగా వాణి భోజన్ నటించింది. అభినవ్ గౌతమ్, యాంకర్ అనసూయ కీలక పాత్రల్లో నటించారు. మరీ.. ఈ సినిమాపై విజయ్ దేవరకొండ పెట్టుకొన్న నమ్మకం నిజమైందా? ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘మీకు మాత్రమే చెప్తా’ ఎలా ఉంది? ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకొంది? తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ!

కథ :

రాకేష్ (తరుణ్ భాస్కర్) టీవీ యాంకర్. డాక్టర్ వాణీ భోజనంతో ప్రేమలో పడతాడు. వీరికి పెళ్లి కూడా కుదురుతుంది. మరో రెండ్రోజుల్లో పెళ్లి అనే సమయంలో రాకేష్ ఫోన్ నుంచి పర్సనల్ వీడియో ఒకటి లీకవుతుంది. ఆ వీడియో బయటపడితే.. తన జీవితం ఖతం అనే టెన్షన్ లో రాకేష్ ఉంటాడు. ఆ తర్వాత ఏమైంది? ఆ వీడియోని డిలీట్ చేయించేందుకు రాకేష్ పడిన తిప్పలేంటీ ? ఇంతకీ ఆ వీడియోలో ఏముంది? ఎవరు దాన్ని అప్ లోడ్ చేశారు? అనేది షాకింగ్ ట్విస్టులతో కూడిన కామెడీ ఎంటర్ టైనర్.. మీకు మాత్రమే చెప్తా.

ప్లస్ పాయింట్స్ :

* తరుణ్ భాస్కర్, అభినవ్ గోమాటంల నటన

* కామెడీ సన్నివేశాలు

* ఫన్ డైలాగ్స్

* రన్ టైం

మైనస్ పాయింట్స్ :

* సెకాంఢాప్ లో కొన్ని బోరింగ్ సన్నివేశాలు

ఎలా ఉందంటే ?

మీకు మాత్రమే చెప్తా మంచి కామెడీ ఎంటర్ టైనర్. యువతని, పెద్దలని ఎంటర్ టైన్ చేసేలా ఉంది. సినిమా ప్రారంభం నుంచే వినోదం పడింది. నాన్ స్టాప్ గా నవ్వులే నవ్వులు. దీంతో ఫస్టాఫ్ హాయిగా సాగిపోతుంది. ఇక సెకాంఢాఫ్ లో దర్శకుడు కాస్త తడబడినట్టు కనిపించింది. అలాగని సినిమా బోర్ కొట్టడు. నవ్వులు ఆగవు. కాకపోతే.. కథనం గ్రిప్పింగ్ గా అనిపించనుంది. ఒకట్రెండు చోట్ల సినిమా పడి లేచినట్టు అనిపించింది. సినిమా రన్ టైం కూడా బాగా కలిసొచ్చింది. రెండు గంటలు హాయిగా నవ్వుకొని థియేటర్ నుంచి బయటికొచ్చే సినిమా. అలాగని మైనస్ లు లేవని కావు. అవి ఫన్ రెడ్ ముందు కనిపించవు అంతే !

ఎవరెలా చేశారు ?

సినిమా ప్రమోషన్స్ లో విజయ్ దేవరకొండ చెప్పినట్టు తరుణ్ భాస్కర్ మంచి నటుడు. అంతకుమించి మంచి కమెడియన్ అని మీకు మాత్రమే చెప్తా రుజువు చేసింది. తరుణ్ భాస్కర్ నటన, ఆయన బాడీ లాంగ్వేజ్ ఫుల్లుగా నవ్విస్తుంది. సినిమాని తన భుజాలపై వేసుకొని నడిపించారు. ఆయనకి తోడు అభినవ్ గోమాటం కితకితలు పెట్టారు. హీరోయిన్ వాణీ భోజనం నటనతో ఆకట్టుకొంది. అనసూయ కనిపించేది కొద్దిసేపే అయినా.. బాగా నటించింది. చివరలో తరుణ్ భాస్కర్ పర్సనల్ వీడియోని ఎవరు లీక్ చేశారనే ట్విస్ట్ అదిరిపోయింది. మిగితా నటీనటులు తమ తమ పరిధి మేరకు నటించారు.

సాంకేతికంగా : 

దర్శకుడు షమీర్ సుల్తాన్ పాత్రలపై పెట్టిన శ్రద్ద కథపై పెట్టలేదు. ఇంకాస్త బలంగా కథని రాసుకొంటే.. సినిమా మరో రేంజ్ లో ఉండేది. తొలి భాగం హాయిగా సాగింది. ప్రతి సన్నివేశం నవ్వులు పూయించింది. ఐతే, ద్వితీయార్థం ఆ రేంజ్ లో లేదు. కొన్ని బోరింగ్ సన్నివేశాలు ఉన్నాయి. ఇక శివ  కుమార్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం బాగున్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. సెకాంఢాఫ్ లో కొన్ని బోరింగ్ సీన్స్ ఉన్నాయి. వాటికి కత్తెరపెట్టొచ్చు. నిర్మాణ విలువలు ఓకే.

చివరగా : ‘మీకు మాత్రమే చెప్తా’ మంచి కామెడీ ఎంటర్ టైనర్. కామెడీ సన్నివేశాలు, ఫన్ డైలాగ్స్ సినిమాకు ప్రధాన బలం.

రేటింగ్ : 3/5

నోట్ : ఇది సమీక్షకుడు వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే