దబాంగ్ 3 ప్రీ-రిలీజ్ ఫంక్షన్ : హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తాజా చిత్రం ‘దబాంగ్ 3’. ప్రభుదేవా దర్శకుడు. సోనాక్షి సిన్హా హీరోయిన్. కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ విలన్ గా నటిస్తున్నారు. టాలీవుడ్  కమెడియన్ అలీ కానిస్టేబుల్ పాత్రలో నటిస్తున్నారు. డిసెంబర్ 20న దబాంగ్ 3ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో వేగం పెంచింది చిత్రబృందం.

ఇందులో భాగంగా ఈరోజు (నవంబర్ 2) హైదరాబాద్ ఎల్భీ స్టేడియంలో దబాంగ్ 3 ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ వేదికపై టాలీవుడ్ స్టార్స్ రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి డ్యాన్స్ చేస్తారనే ప్రచారం జరిగింది. ఐతే, దీనిపై ఎలాంటి అధికారిక సమాచారమ్ లేదు. ఇక దబాంగ్ 3 ప్రీ రిలీజ్ ఫంక్షన్ నేపథ్యంలో హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ మేరకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఓ ప్రకటన చేశారు. సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల వరకు స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ అనిల్‌కుమార్ తెలిపారు.

ట్రాఫిక్ ఆంక్షలు విధించిన రూట్ల వివరాలు :

* ఏఆర్ పెట్రోల్ బంక్ జంక్షన్ వద్ద నుంచి బీజేఆర్ విగ్రహంపై ట్రాఫిక్‌ను అనుమతించరు. ఈ రూట్‌లో వచ్చే వాహనాలు నాంపల్లి వైపు, రవీంధ్ర భారతి వైపు నుంచి వెళ్లాలి.

* అబిడ్స్, గన్‌ఫౌండ్రీ వైపు నుంచి బీజేఆర్ విగ్రహం వైపు ట్రాఫిక్ ను అనుమతించరు. ఈ రూట్ వాహనాలు గన్‌ఫౌండ్రీ నుంచి చాపల్‌రోడ్డు నుంచి వెళ్లాలి. బషీర్‌బాగ్ జంక్షన్ నుంచి అబిడ్స్, జీపీఓ వైపు వెళ్లే వాహనాలు హైదర్‌గూడ, కింగ్‌కోఠి వైపు వెళ్లాలి.

* ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బషీర్‌బాగ్ వైపు వెళ్లే వాహనాలు.. హిమాయత్‌నగర్ జంక్షన్ నుంచి మళ్లిస్తారు.

* బషీర్‌బాగ్ వైపు కింగ్‌కోఠి భారతీయ విద్యాభవన్ మీదుగా వచ్చే వాహనాలను కింగ్‌కోఠి ఎక్స్ రోడ్స్ వద్ద తాజ్‌మహాల్ హోటల్, ఈడెన్ గార్డెన్ వైపు మళ్లిస్తారు.

* లిబర్జీ జంక్షన్ నుంచి బషీర్‌బాగ్ వైపు వెళ్లే వాహనాలను, హి మాయత్‌నగర్ జంక్షన్ వైపు మళ్లించనున్నారు.