ఈ నెల 5 – ఆర్టీసీ కార్మికులకి డెడ్ లైన్ !
సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. సుదీర్ఘంగా సాగిన సమావేశంలో మొత్తం 40 అంశాలపై చర్చించారు. సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. కేభినేట్ తీసుకొన్న నిర్ణయాలని వివరించారు. ప్రస్తుతం ఆర్టీసీ మొత్తం 10400 బస్సులు నడుపుతోంది. వీటిలో 2100 ప్రయివేటు బస్సులు ఉన్నాయి. ఈ సంఖ్యని 5100కు పెంచాలని కేభినేట్ నిర్ణయించింది. అంటే.. కొత్తగా మరో 3000 ప్రయివేట్ బస్సులని తీసుకోనున్నారు.
ఇక సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకి సీఎం కేసీఆర్ మరో అవకాశం ఇచ్చారు. ఈ నెల 5 వరకు విధుల్లో చేరాలని కోరారు. “రాష్ట్రం తెచ్చిన నాయకుడిగా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గా అప్పీల్ చేస్తున్న యూనియన్ మాయలో పడి ఆగం కాకుర్రి.. మీ కుటుంబాన్ని బజారున పడెయ్యకండి నవంబర్ 5 లోపు ఉద్యోగం లో చేరండి. ప్రభుత్వం ఇచ్చిన సదవకాశాన్ని ఉపయోగించుకోండి” అన్నారు సీఎం. అంతేకాదు.. ఈ నెల 5 అంటే.. మంగళవారం అర్థరాత్రి వరకు ఎవరైతే విధుల్లోకి చేరకపోతే.. ఇక వారి ఉద్యోగాలు పోయినట్టేనని స్పష్టంగా చెప్పారు. వారి స్థానంలో ప్రయివేటు వాళ్లని తీసుకొంటామని కూడా తెలిపారు.